మేడ్చల్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గ్రామా ల్లో ఏర్పాటు చేయనున్న పల్లె దవాఖానల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా భవన నిర్మాణాలు చేపట్టనుంది. వైద్య సేవలను పల్లె ప్రజలకు మరింత చేరువ చేసేందుకుగాను మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 35 దవాఖానల ఏర్పాటు కు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతో మొదటి దశ లో 15పక్కా భవన (పల్లె దవాఖాన)ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.2 కోట్ల 40లక్షల నిధులను మంజూరు చేసింది. ఒక్కొక్క దవాఖాన భవన నిర్మాణానికి రూ.16లక్షలు వెచ్చించనుంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పల్లె దవాఖానలకు ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసి వైద్యశాఖకు అప్పగించారు. భవనాల నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల పక్రియ పూర్తయిన వెంటనే పనులను ప్రారంభించనున్నారు. దవాఖానల్లో నాణ్యమైన వైద్య సేవలు పల్లె ప్రజలకు అందేలా భవన నిర్మాణాలు జరగనున్నాయి.
ఇప్పటికే పల్లె దవాఖానల్లో వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో 35 పల్లె దవాఖానలకు గాను ఇప్పటికే 27 పల్లె దవాఖానలలో వైద్యుల, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సుల నియామకం పూర్తయింది. భవన నిర్మాణాలు పూర్తయ్యే వరకు అందుబాటులో ఉన్న ఆరోగ్య సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్య సేవలను అందించనున్నారు.
పల్లె దవాఖానలను సిద్ధం చేశాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె దవాఖానలను సిద్ధం చేశాం. జిల్లాలో 35 పల్లె దవాఖానలకు గాను 26 మంది వైద్యులు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సుల నియామకం పూర్తయింది. జిల్లాలో 15 పల్లె దవాఖానలకు పక్కా భవనాలు ప్రభుత్వం నిర్మిస్తుంది. భవన నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించాం. భవనాలు ప్రజలకు అందుబాటులో వచ్చే వరకు తాత్కాలికంగా ఆరోగ్య సబ్ సెంటర్లలో వైద్య సేవలు అందిస్తాం. – మల్లికార్జునరావు, వైద్యాధికారి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
పల్లె దవాఖానల భవన నిర్మాణాలకు ప్రభుత్వం రూ.2 కోట్ల 40 లక్షల నిధులను మంజూరు చేసింది. మొదటి దశలో భాగంగా 15 దవాఖానలకు పక్కా భవనాలను నిర్మించనున్నాం. పల్లె ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య, విద్యకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. – చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి