Singer Janaki | దిగ్గజ గాయని ఎస్.జానకి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) ఈరోజు ఉదయం కన్నుమూశారు. మురళీకృష్ణ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రముఖ గాయని కె.ఎస్. చిత్ర సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేవలం గాయని కుమారుడిగానే కాకుండా, మురళీకృష్ణకు కళారంగంతో విడదీయలేని అనుబంధం ఉంది. భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉన్న ఆయన నటుడిగా కూడా తన ముద్ర వేశారు. తెలుగులో ‘వినాయకుడు’, ‘మల్లెపువ్వు’ వంటి చిత్రాల్లో నటించడమే కాకుండా, ‘కూలింగ్ గ్లాస్’ అనే మలయాళ సినిమాకు రచయితగా కూడా వ్యవహరించారు. గతంలో తన తల్లి ఆరోగ్యంపై తప్పుడు వార్తలు వచ్చినప్పుడు ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చేవారు. మురళీకృష్ణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన అకాల మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.