పీర్జాదిగూడ, నవంబర్ 3: పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరదనీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించడం హర్షణీయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరద నీటి సమస్యను అరికట్టేందుకు చేపట్టే ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పత్రాలను పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డికి మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతాలైన మల్లాపూర్‌లోని చెరువులు, బోడుప్పల్ రాచెరువు, చింత చెరువు, పోచమ్మ చెరువు వరదనీటిని నేరుగా ముసీలో కలిపేటట్లు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాచెరువు నుంచి వచ్చే వరద సమస్యను అరికట్టేందుకు రూ. 6 కోట్లతో నాలా నిర్మాణం జరుగుతున్నదన్నారు. రానున్న వానకాలం నాటికి ఈ నిర్మాణ పనులు పూర్తవుతాయని ఆయన తెలిపారు.
సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్ట్టికి సమస్యను తీసుకెళ్లడంతో స్పందించారని తెలిపారు. కేటీఆర్ ముంపు ప్రాంతాలను సందర్శించి రూ.110 కోట్లు మంజూరు చేశారన్నారు. రాష్ట్రంలోని 142 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జరగని అభివృద్ధి బోడుప్పల్ , పీర్జాదిగూడ కార్పొరేషన్లలో జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పి.రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్లు శివకుమార్‌గౌడ్, లక్ష్మీ రవిగౌడ్, అధికారులు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.