Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా, సమయం దొరికితే చాలు భార్య పిల్లలతో కలిసి వెకేషన్కు వెళ్లిపోతుంటారు. ముఖ్యంగా తన భార్య నమ్రతా శిరోద్కర్ను మహేష్ బాబు ఎంతో ప్రేమగా చూసుకుంటారని అభిమానులు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఇవాళ (జనవరి 22) నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు చేసిన ఎమోషనల్ విషెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్య పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నమ్రతా ఫోటోను షేర్ చేస్తూ హృదయాన్ని తాకే క్యాప్షన్ ఇచ్చారు.
“హ్యాపీ బర్త్ డే ఎన్ఎస్జీ (నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని). ఎంతో గ్రేస్, ప్రేమతో అన్నింట్లోనూ నాతో కలిసి సాగుతున్నందుకు ధన్యవాదాలు. ఇంతకంటే ఇంకేం అడగాలి” అంటూ రాసుకొచ్చారు. భర్తగా తన ప్రేమను ఎంతో సింపుల్గా కానీ ఎమోషనల్గా వ్యక్తపరిచిన ఈ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు పెట్టిన ఈ పోస్టుకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. “వదినమ్మా హ్యాపీ బర్త్ డే”, “కపుల్ గోల్స్”, “రియల్ లవ్ అంటే ఇదే” అంటూ కామెంట్లతో సోషల్ మీడియా నిండిపోయింది. మహేష్ – నమ్రతా జంట సినీ ఇండస్ట్రీలో అత్యంత గౌరవప్రదమైన, అభిమానించే జంటలలో ఒకటిగా నిలిచింది మరోసారి అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ప్రేమ కథ కూడా అభిమానులకు తెలిసిందే. 2000లో విడుదలైన ‘వంశీ’ సినిమాలో కలిసి నటించిన సమయంలో వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2006 ఫిబ్రవరి 10న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలతో సంతోషంగా కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నమ్రతా మాజీ మిస్ ఇండియా కావడం విశేషం. వివాహం తర్వాత ఆమె సినిమాలకు దూరమై కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, మహేష్ బాబు ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.