ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 3 : ప్రజల సంక్షేమం కోసం పని చేయని కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఆ పార్టీలకు హుజూరాబాద్‌లో డిపాజిట్లు గల్లంతవుతాయని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఎదులాబాద్‌లో టీఆర్ఎస్ అధ్యక్షుడు నాగులపల్లి రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన నూతన కార్యవర్గ సర్వసభ్య సమావేశంలో మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.
మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా 1 కోటి 8లక్షల బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీవి ప్రగల్భాలు తప్ప అభివృద్ధి ఉండదని , పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన పడవ లాంటిదన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, పార్టీ ప్రతిష్టతను మరింత పెంచాలని సూచించారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ర్టాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షుడు కందుల కుమార్, సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, రాములు గౌడ్, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.