శామీర్పేట, సెప్టెంబర్ 8 : మేడ్చల్ జిల్లాలోని 61 గ్రామ పంచాయతీలకు ఈ నెలాఖరు వరకు ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం నిర్వహించిన శామీర్పేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి దిశగా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రైతాంగం, కులవృత్తుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు మంజూరు చేయగా, మంత్రిగా తనకు మరో రెండు కోట్లు అదనంగా కేటాయించారన్నారు.
ఇప్పటికే మేడ్చల్ జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.10లక్షలు చొప్పున కేటాయించామని, ఈ నెలాఖరు వరకు జిల్లాలోని 61 గ్రామాలకు రూ.10 లక్షలు చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. ఎంపీటీసీలు నిధులు లేవని ఇబ్బందులు పడకూడదని, ప్రభుత్వమే ప్రజలకు కావాల్సిన పనులు చేసిపెడుతుందని చెప్పారు. త్వరలోనే మండలాలకు ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయన్నారు.
అనంతరం శాఖలవారీగా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, వైస్ ఎంపీపీ సుజాతతిరుపతిరెడ్డి, డీఈ వేణుగోపాల్, ఎంపీడీవో వాణి, తాసీల్దార్ సురేందర్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 8 : ప్రతి ఒక్కరూ మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్టించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కుమ్మరి సంఘం నేత సిలసాగారం నాగేందర్ మంత్రికి మట్టి గణపతులను అందజేశారు. నాగారం టీఆర్ఎస్ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, నాయకులు నిమ్మల శ్రీనివాస్, బోడుసు రమేశ్, దుర్గం సాయినాథ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.