ముంబై, జనవరి 23 : మహారాష్ట్రలోని మున్సిపల్ ఎన్నికల్లో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. రాజకీయంగా బద్ధ శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్, ఏఐఎంఐఎం కూటమిగా ఏర్పడ్డాయి. అమరావతి జిల్లా అచల్పూర్ మున్సిపల్ కౌన్సిల్లో వివిధ కమిటీల అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఈ మూడు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. అకోట్ మున్సిపాల్టీలో ఇదే తరహాలో బీజేపీ.. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంతో, అంబర్నాథ్ మున్సిపాల్టీలో కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్న ఒక రోజు తర్వాత అచల్పూర్లో సైతం ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అచల్పూర్లో మొత్తం 41 సీట్లలో కాంగ్రెస్ 15, బీజేపీ 9, ఏఐఎంఐఎం 3, స్వతంత్రులు 10, ప్రహర్ జనశక్తి 2, ఎన్సీపీ 2 స్థానాలు గెల్చుకున్నాయి. తాజాగా మూడు పార్టీల మధ్య కుదిరిన పొత్తు మేరకు ఏఐఎంఐఎం కౌన్సిలర్ ఒకరు విద్య, క్రీడా కమిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే నీటి సరఫరా కమిటీకి కాంగ్రెస్ కౌన్సిలర్, మహిళ, శిశు సంక్షేమ కమిటీకి బీజేపీ కౌన్సిలర్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సిద్ధాంతపరంగా తీవ్రంగా విభేదించే ఏఐఎంఐఎంతో ఈ ఎన్నికల్లో పొత్తు ఎలా పెట్టుకున్నారని అచల్పూర్ బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ తయడేను మీడియా ప్రశ్నించగా ‘నేను హిందూత్వ భావాలున్న ఎమ్మెల్యేను. మా పార్టీ కూడా అదే భావాలను అనుసరిస్తుంది. కాబట్టి నేను ఎప్పుడూ దానికి వ్యతిరేకంగా పని చేయను. అయితే ఈ విషయంలో మా పార్టీ సీనియర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో దానిని మేం అంగీకరిస్తాం. దానిని పాటిస్తాం’ అని ఆయన అన్నారు. గత నెల్లో స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత అకోల జిల్లాలోని అకోట్ మున్సిపల్ కౌన్సిల్లో బీజేపీ, ఏఐఎంఐఎంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మందలించడంతో తర్వాత అది రద్దయ్యింది. అంబర్నాథ్ మున్సిపాల్టీలో కూడా శివసేనను దూరం పెట్టడానికి బీజేపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి.