“కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు కల్పించాం. విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపునిండా భోజనం పెడుతున్నాం. ‘ సమైక్య రాష్ట్రంలో సర్కార్ బడికి రానన్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సర్కార్ బడికైతేనే పోతాం..’ అంటూ మారం చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం వారి పిల్లలను ప్రైవేటు బడుల్లో మాన్పించి.. సర్కార్ బడులకు పంపుతున్నారు. దీన్ని బట్టే సర్కార్ బడులు ఎంతగా అభివృద్ధి చెందాయో.., ఎంత నాణ్యమైన విద్య అందజేస్తున్నారో ఇట్టే అర్ధమవుతుంది. అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను సర్కార్ బడులకే పంపాలి. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను పొంది ఉన్నత స్థాయికిఎదగాలి” ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి.
కీసర, సెప్టెంబర్ 8 : ఉపాధ్యాయ వృత్తి అన్ని రంగాలకంటే పరమ పవిత్రమైందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని జీపీఆర్ గార్డెన్లో జిల్లా వ్యాప్తంగా ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి ఎన్ఎస్ఎస్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంస పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తున్నదన్నారు.
సర్కార్ బడుల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య అందుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారంతా గొప్ప ప్రయోజకులు అవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. స్వరాష్ట్రంలోనే హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, మంత్రి కేటీఆర్ ఐటీ రంగం అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తుండటంతో లక్షలాది మందికి ఉద్యోగ అవకాలు లభిస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని తెలిపారు.
రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని, ఉపాధ్యాయులు అంతా కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి ఎన్ఎస్ఎస్ ప్రసాద్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, ఎంపీడీవో పద్మావతి, అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యాంసన్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రామేశ్వర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి, ఎంఈవో శశిధర్, ఆంజనేయులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.