ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 6: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఎదులాబాద్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రూ.40 లక్షల నిధులతో చేపడుతున్న కవర్డ్ షెడ్ నిర్మాణానికి మంత్రి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల పంట సాగుకు ప్రభుత్వం బాసటగా నిలిచి రైతుబంధు పథకాన్ని , ప్రమాదవశాత్తు రైతు మృతి చెందితే బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నదని తెలిపారు. అంతేకాకుండా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
ఏ కాలంలో ఏ పంటలు వేయాలి ? తదితర సలహాలు, సూచనలు రైతు వేదిక కార్యాలయాల్లో రైతులకు అందజేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఇన్చార్జి చైర్మన్ ముత్యం రెడ్డి, ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కొండల్ రెడ్డి, రమేశ్, కృష్ణమాచారి, అనిల్ చౌదరి, పోచారం మున్సిపల్ చైర్మన్ బి.కొండల్ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, మండల సహకార సంఘం చైర్మన్ రాంరెడ్డి, డైరెక్టర్ ధర్మారెడ్డి, మున్సిపల్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బి. శ్రీనివాస్ గౌడ్, కుమార్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, సర్పంచ్ సురేశ్, ఎంపీటీసీ రవి, నాయకులు పాల్గొన్నారు.
మేడ్చల్ : క్రమశిక్షణకు మారుపేరు టీఆర్ఎస్ పార్టీ అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేడ్చల్, శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాలు, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూంకుంట మున్సిపాలిటీల టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు వార్డు, గ్రామ కమిటీల నియామకం కోసం ఎన్నికల ఇన్చార్జిలను నియమించి వారికి బాధ్యతలు అప్పగించారు.ఈ నెల 8వ తేదీ వరకు వార్డు, గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో రూ. కోటిన్నర నిధులతో చేపట్టిన బీటీ, సీసీ రోడ్లు, వైకుంఠధామాన్ని మంత్రి మల్లారెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం అలుగు పారుతున్న మేడ్చల్ పెద్ద చెరువును మంత్రి పరిశీలించి పూజలు చేశారు. ఈ నెల 9న మంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని మేడ్చల్ 4వ వార్డు కౌన్సిలర్ తుడుం గణేశ్ రూపొందించిన పాటల సీడీని మంత్రి ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహా రెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు , టీఆర్ఎస్ డివిజన్, మండల, మున్సిపల్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.