దుండిగల్, సెప్టెంబర్ 4 : రాష్ట్రంలోని దళితులు.. ధనికులు కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని.. ఇందుకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని కార్మిక, ఉపాధి కల్పన శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు, దుండిగల్ తండా-2లో సీఎస్ఆర్ నిధులు రూ.1.60 కోట్లతో నిర్మించిన చేతివృత్తుల నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని(కామన్ ఫెసిలిటీ సెంటర్)ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో కలిసి మంత్రి శనివారం ప్రారంభిం చారు. ఈ నిధులను టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటరీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి చొరవతో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాల, ఎంఎల్ఆర్ విద్యాసంస్థల సీఎస్ఆర్ ఇచ్చింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి దళితులు ధనికులు కావాలనే సంకల్పంతో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి.. ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందించి.. దళితులు ఆర్థిక స్వాలంబన సాధించే దిశగా ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఎంఎల్ఆర్ విద్యాసంస్థల సెక్రటరీ, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి తండాలను దత్తగా తీసుకొని.. అందులోని మ హిళలకు ఉపాధి రంగాల్లో అవకాశాలను కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు.
లంబాడి ఆడబిడ్డల అభ్యున్నతికి ఇలాంటి కార్యక్ర మాలు ఎంతగానో దోహదపడుతాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.1.60 కోట్లతో గిరిజన మహిళలకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగరాజు, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రూప్‌సింగ్‌నాయక్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, దుండిగల్ మున్సిపల్ చైర్మన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ, వైస్ చైర్మన్ పద్మారావు, స్థానిక కౌన్సిలర్ శంకర్‌నాయక్, కౌన్సిలర్లు, మహిళా సంఘం అధ్యక్షురాలు శాంతాబాయితో పాటు పలువురు గిరిజన మహిళలు పాల్గొన్నారు.
తమకు చెందిన ఎంఎల్ఆర్ విద్యాసంస్థలతో పాటు ఐఏఆర్ఈ కళాశాల సీఎస్ఆర్ నిధులు రూ.1.60 కోట్లతో దుండిగల్ తండా-2లో కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం సం తోషంగా ఉందని ఎంఎల్ఆర్ విద్యాసంస్థల కార్యదర్శి, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటరీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఇక్కడి గిరిజన (లంబాడి) మహిళల అభ్యున్నతి కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇందులో వివిధ రకాల ఉపాధి శిక్షణ అందిస్తామని, ప్రాథమికంగా 300 మందికి శిక్షణ అందించి.. ఉపాధి కల్పిస్తామని ఆయన తెలిపారు.