మేడ్చల్, ఆగస్టు 31: తెలంగాణలో కుల వృత్తుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పథకాలు చేపట్టి వృత్తిదారులను ఆదుకుంటున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రజకులు ఆధారపడి జీవనం సాగిస్తున్న ఇస్త్రీ దుకాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్ మీటర్లను మంగళవారం మేడ్చల్‌లో మంత్రి ప్రారంభించారు. అనంతరం, పట్టణంలోని అమ్మవారి ఆలయ ముఖ ద్వారం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రజకులు, నాయీ బ్రాహ్మణుల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ పెద్ద మనుసుతో ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తూ ఆదుకుంటున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏ సీఎం కూడా కుల వృత్తిదారులను పట్టించుకోలేదన్నారు. యాదవులకు గొర్రెలు, ముదిరాజ్‌లకు ఉచిత చేప పిల్లలు అందజేశారన్నారు.
అంతే కాకుండా ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమాతో పాటు కొత్తగా దేశంలో ఎక్కడాలేని విధంగా దళిత బంధును తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. మేడ్చల్‌లోని 170 మంది రజకులకు ఉచితంగా విద్యుత్‌ను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న ఈ సహాయాన్ని రజకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేడ్చల్‌లో రజకుల కోసం దోబీఘాట్‌ను మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, ఎంపీపీ పద్మా జగన్‌రెడ్డి, రజక సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పంజగారి ఆంజనేయులు, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి విష్ణుచారి, నాయకులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.