బోడుప్పల్, ఆగస్టు 29: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు మైసమ్మ ఆలయంలో జంట కార్పొరేషన్ల మేయర్లు సామల బుచ్చిరెడ్డి, జక్క వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనగాపురి కాలనీ, ఎన్ఐఎన్ కాలనీ వాసులు అధిక సంఖ్యలో వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం 9గంటలకు రంగం కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్పొరేటర్లు సింగిరెడ్డి పద్మారెడ్డి, లతారామచంద్రారెడ్డి,లావణ్యశేఖర్రెడ్డి,సుమన్ నాయక్,శ్రీవిద్య చక్రపాణిగౌడ్, మహేశ్వరి, హేమలతాజంగారెడ్డి, అనిత యాదగిరి, పద్మారాములు నర్సింహ, మహేందర్, నాయకులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్ : ఘట్కేసర్ మండలంలోని కొర్రెముల, అంకుషాపూర్‌లో బోనాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు బోనాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. సర్పంచ్ వెంకటేశ్ గౌడ్, మాజీ సర్పంచ్ కవిత, అంకుషాపూర్ సర్పంచ్ జలజ సత్యనారాయణ రెడ్డి పాల్గొని పూజలు చేశారు.
శామీర్‌పేట : తూంకుంటలో బొడ్రాయి ప్రతిష్ఠాపన ముగింపు సందర్భంగా ఆదివారం గ్రామ దేవతలకు బోనం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి మల్లారెడ్డి బొడ్రాయిని దర్శించుకుని పూజలు చేశారు.చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
మేడ్చల్ : మేడ్చల్‌లో గడిమైసమ్మ ఆలయ బోనాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు తొట్టెల ఊరేగింపు తదితర కార్యక్రమాలు చేశారు. మంత్రి మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.