ఘట్కేసర్, ఆగస్టు 25 : ఘట్కేసర్ మున్సిపాలిటీలో ప్రజలు ఆశించిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం ఘట్కేసర్లోని మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రూ.10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను చైర్పర్సన్ ముల్లి పావనీజంగయ్య యాదవ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటైన ఘట్కేసర్ మున్సిపాలిటీలో ప్రజలు ఆశించిన అభివృద్ధి పనులు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చురుకుగా కొనసాగుతున్నాయన్నారు.
ఇక్కడి పాలకవర్గం నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుదలతో పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలను సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. గతంలో పంచాయతీగా ఉన్న ఘట్‌కేసర్‌ను పరిసర గ్రామాలతో కలిపి మున్సిపాలిటీ చేయడంతో పూర్తిస్థాయిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయల కల్పన కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు, ప్రజలు కావాల్సిన అభివృద్ధిని ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్ ఆంజనేయులు గౌడ్, టీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.