మేడ్చల్, ఆగస్టు 20 : అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల శ్రేయస్సుకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్లో ఇటీవల మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కొరివి కృష్ణకు మంజూరైన రూ. 6.3 లక్షల ప్రమాద బీమా చెక్కును శుక్రవారం అతడి కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించిందని చెప్పారు. ప్రతి కార్మికుడు బీమా చేయించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్రెడ్డి, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల మారయ్య, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు సందీప్గౌడ్, దొంతుల రాజు, మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.