ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 12 : దైవచింతన కలిగిన ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని, రంగనాయకస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి ఎదులాబాద్ గ్రామంలోని గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం స్వామి వారి కల్యాణం ఘనంగా జరిగింది. మంత్రి మల్లారెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి పూజలు చేశారు. మంత్రి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. ఎదులాబాద్ గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. స్వామి వారి కల్యాణ వేడుకలను తిలకించేందుకు వివిధ మండలాల నుంచి భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేశ్, పీర్జాదిగూడ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు దర్గ దయాకర్ రెడ్డి, బోడుప్పల్ కార్పొరేటర్ చందర్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కందుల కుమార్ పాల్గొన్నారు.