మేడ్చల్, ఆగస్టు16(నమస్తే తెలంగాణ): ధరణిని పకడ్బదీంగా అమలు చేసేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశం హాల్లో సోమవారం ఆర్డీవో, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు ముందుగానే వారి సెల్‌ఫోన్‌కు సమాచారం అందించాలని ఆదేశించారు. ధరిణి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి తహసీల్దార్లు ప్రతిరోజూ ఉదయం 10:20నిమిషాలకు లాగిన్ కావాలన్నారు. మ్యూటేషన్లు, వారసత్వ బదాలయింపులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. భూముల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. గ్రామాల వారీగా సర్వే చేసి ప్రభుత్వ భూముల వివరాల నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీఆర్వో లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య పాల్గొన్నారు.