మల్కాజ్గిరి : ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై బోయిన్పల్లి క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులతో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సింగిల్ ఫేజ్ విద్యుత్ కనెక్షన్లను త్రీ ఫేజ్‌కు మార్చడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. నీటి నిల్వలు, మురుగునీటి పారుదల కోసం బాక్స్ డ్రైన్ల నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. వేసవిలో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా అధికారులతో సమీక్షిస్తామని పేర్కొన్నారు. కొత్త రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామని చెప్పారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు కృషి చేయాలని నాయకులను ఆదేశించారు.