Pocharam | పోచారం, జూన్13: రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రోడ్లు ఆక్రమణకు గురై స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి పోచారం మున్సిపాలిటీలో అన్ని ప్రాంతాలలో నెలకొంది.
రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు జరుగుతున్నాయంటూ స్థానిక ప్రజలు మున్సిపాలిటీ కమిషనర్, సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పలు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు ఉదాహరణగా పోచారం మున్సిపాలిటీ ముత్వెల్లిగూడలో సర్వే నంబర్ 1లో రోడ్డును ఆక్రమించి సమీపంలోని 83 సర్వేనంబర్ భూమి పేరుతో ఇంటి నిర్మాణం జరుగుతుంది. సెల్లార్‌కు అనుమతి లేకున్నా, సెల్లార్‌తో కూడిన నిర్మాణం జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రజలు అన్నారు. ఇలా అంతర్గత రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు జరిపితే భవిషత్లో రోడ్లు కనిపించకుండా పోయి ఇరుకు రోడ్లుగా తయారవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సర్వే జరిపి చర్యలు తీసుకోవాలని సర్వేకు దరఖాస్తు చేసుకున్నా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించడం లేదని ఇక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విధంగా మున్సిపాలిటీ పరిధిలోని అనేక ప్రాంతాలలో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా రోడ్ల ఆక్రమణను అరికట్టి భవిషత్లో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.