కాప్రా, మే 23 : కాప్రా చెరువులోకి వర్షపునీటిని చేర్చే ఈశ్వరిపురి, క్లాసిక్ ఎంక్లేవ్ స్మార్ట్ వాటర్ డ్రయిన్ పనులను వేగవంతం చేయాలని కాప్రా సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. కాప్రా చెరువును కార్పొరేటర్ స్వర్ణ రాజు, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. చెరువు సమీపంలోని ఈశ్వరిపురి కాలనీ నుంచి మైత్రీ ఎంక్లేవ్ వరకు చెరువు బండ్ మీదుగా కాలినడకన చెరువు చుట్టూ తిరిగారు. చెరువు పరిసరాలు, చెరువు వద్ద నెలకొన్న సమస్యలను స్వయంగా చూసి, అధికారులతో చర్చించారు. ఈశ్వరిపురి, క్లాసిక్ ఎంక్లేవ్ వాటి పరిసర కాలనీల నుంచి వచ్చే వర్షపు నీటిని చెరువులోకి తరలించేందుకు నిర్మిస్తున్న స్మార్ట్ వాటర్ డ్రెయిన్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా డ్రెయిన్ పనులను వేగవంతం చేయాలని, రానున్న వర్షాకాలంలో డ్రెయిన్ల ద్వారా వచ్చే వర్షపు నీటిని చెరువులో నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని, చెరువు పరిసరాల్లో మొక్కల పెంపకం చేపట్టాలని జోనల్ కమిషనర్ సూచించారు. చెరువులోని నీరు బయటకు వెళ్లకుండా వాల్వులకు మరమ్మతులు చేయాలని, లీకేజీలను అరికట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కాప్రా చెరువుకు పునర్వైభవం చేకూరేలా తగిన చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.