Keesara | కీసర, మార్చి 2: కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కీసరగుట్టలో ఈ సంవత్సరం నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయం తరఫున పూర్తి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి పూర్తి విజయవంతం చేశామని పేర్కొన్నారు.
ప్రభుత్వపరంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, కీసర ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, పోలీసు శాఖతో పాటు జిల్లాలోని పలు శాఖలకు సంబంధించిన అధికారులందరికీ ఆలయం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం, దేవాలయం తరఫున చేసిన ఏర్పాట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు ఈ సంవత్సరం చాలా సులువుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులను తీర్చుకున్నారని అన్నారు.
కీసరగుట్టలోని శ్రీ ఆర్యవైశ్య భవనంలోని శ్రీ వాసవిమాతకు మహిళలు ఘనంగా కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కీసరగుట్టలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం తరఫున భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అనంతరం అమ్మవారికి వైశ్య సంఘానికి చెందిన మహిళ మాతల చేత శ్రీ వాసవి అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక అభిషేకాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మహిళల నుంచి ఆపూర్వ స్పందన లభిస్తుంది. అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు బెలిదే రమేశ్‌గుప్త, శ్రీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ చైర్మన్ రాయిల శ్రవణ్ కుమార్ గుప్తాలతో పాటు పలువురు ఆర్యవైశ్య సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.