శామీర్ పేట, జనవరి 21: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుండటంతో కాంగ్రెస్ పై ప్రజలకు విసుగు వచ్చిందని, అందుకే అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేరొన్నారు. బుధవారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి అవినీతి రాజ్యాన్ని నడుపుతోందని తీవ్రంగా విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో ప్రతి వర్గానికి మేలు చేశామని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎల్లంపేట, అలియాబాద్, ఎంసీపల్లి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.