జగద్గిరిగుట్ట, ఏప్రిల్ 18: అధికారుల మధ్య సమన్వయ లోపం అక్రమ నిర్మాణదారులకు కలిసివస్తోంది. రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్‌లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా సరైన అనుమతులు లేకుండానే ప్రధాన రహదారుల్లో వాణిజ్య సముదాయాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి, పారిశ్రామికవాడలోనూ అక్రమ నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. ఎలాంటి సెట్‌బ్యాక్ లేకుండానే షెడ్లు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అది తమ పరిధి కాదంటూ ఐలా, మున్సిపల్ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఇటీవలే ఐలా కాంట్రాక్ట్ సిబ్బంది మొత్తం బదీలీ జరిగి, కొత్త సిబ్బంది వచ్చారు. దీంతోనే పర్యవేక్షణ కుంటుపడుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
ఎర్రగోడలు సమీపంలో రాయల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ఎదురుగా భారీ షెడ్ నిర్మిస్తున్నారు. ఓ పరిశ్రమకు చెందిన వారు రహదారి ఇరుకుగా మారేలా నిర్మాణం చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. అందులో వాణిజ్య కార్యకలాపాలు సాగితే రహదారి పూర్తిగా ఆక్రమణకు గురవుతుంది. గాంధీనగర్‌కు వెళ్లే రహదారిలో ట్రాక్ సమస్య తలెత్తుతుంది. శివాజీ విగ్రహం నుంచి రంగారెడ్డి నగర్‌కు వెళ్లే దారిలో ఓ పరిశ్రమపై ఫ్యాబ్రికేషన్ విధానంలో అదనపు అంతస్తు వేశారు. కింద ఉన్న వాటికి ఎలాంటి సెట్‌బ్యాక్ లేదు. దానిపైన ప్రమాదకరంగా అంతస్తు నిర్మిస్తున్నప్పటికీ పట్టించుకునేవారు కరవయ్యారు. కమల్ కాంటా సమీప వీధిలో 500 గజాల్లో సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం సాగుతోంది. ఇప్పటికే ఓ అంతస్తు పూర్తవగా మరో రెండతస్తుల నిర్మాణానికి యజమాని పనులు సిద్ధం చేసుకుంటున్నాడు. అస్ డిస్టర్స్ కాలనీ నుంచి జగద్గిరిగుట్ట వెళ్లే ప్రధాన రహదారిలో సంజయ్ గాంధీనగర్ వద్ద మూడంతస్తుల వాణిజ్య భవనం ఎలాంటి ఖాళీ స్థలం లేకుండా నిర్మితమైంది. శివాజీ విగ్రహం, వివేకానంద విగ్రహం, ఎర్రగోడలు, సంజయ్ గాంధీనగర్ పరిసరాల్లో ఇప్పటికే పలు నిర్మాణాలు పూర్తయి రోడ్లను ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారు. సామాన్యుడి ఇంటిపై అదనపు అంతస్తు నిర్మిస్తేనే టౌన్ ప్లానింగ్ సిబ్బంది హడావుడి చేస్తారు. భారీ నిర్మాణాలు చేపడుతున్న చర్యలు లేవంటే ఏ స్థాయిలో తెర వెనుక తతంగం నడిచిందో అర్థం చేసుకోవచ్చని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా మున్సిపల్, ఐలా అధికారులు నిర్మాణాలు పరిశీలించి నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.