Theft | దుండిగల్, మార్చి19 : గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాన్ని బద్దలు కొట్టి అందిన కాడికి దోచుకెళ్లిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన జాఫర్ మియా కుటుంబం కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారంలోని వీనస్ ఎన్‌క్లేవ్‌లో స్థిరపడింది.
రంజాన్ మాసం కావడంతో ఇంటికి తాళం వేసి పక్షం రోజుల క్రితమే జాఫర్ మియా కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆదివారం జాఫర్ మియా కొడుకు గాజుల రామారంలోని తన ఇంటికి వెళ్లి తిరిగి కర్నూల్ వెళ్ళాడు. అయితే సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళం బద్దలు కొట్టి ఇంట్లో ప్రవేశించి దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించిన ఇరుగుపొరుగు వారు జాఫర్ మియాకు సమాచారం అందించారు.
జాఫర్ మియా ఇవాళ ఇంటికి చేరుకుని పరిశీలించగా 22 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి వస్తువులతోపాటు రూ.15 వేలనగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో జాఫర్ మియా సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.