ఘట్కేసర్, ఆగస్టు 26 : హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి పచ్చందాలు సంతరించుకున్నది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఎన్‌హెచ్-163 హైవేపై విభిన్న రకాల మొక్కలు, సెంట్రల్ మీడియన్లు కొత్తందాన్ని ఇస్తున్నాయి. యాదాద్రి పునర్నిర్మాణం పూర్తి కావొస్తుండడంతో ఉప్పల్ నుంచి రాయగిరి వరకు రద్దీ అధికంగా ఉంటోంది. వారాంతాల్లో ఇంకా అధికం. ఘట్కేసర్ సమీపంలోని పోచారం పురపాలక పరిధి అన్నోజిగూడ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు హెచ్ఎండీఏ హరిత ప్రాజెక్టు చేపట్టింది.
సుమారు రూ.5 కోట్లతో 29 కిలోమీటర్లు హరితదారిగా మార్చాలని సంకల్పించి..ఘట్కేసర్, అవుశాపూర్, బీబీనగర్ ఎయిమ్స్ దవాఖాన, గూడూరు టోల్‌ప్లాజా, భువనగిరి టౌన్, వివేరా హోటల్, రాయగిరి మొత్తం 7 విభాగాలు చేసి మొక్కల పెంపకాన్ని చేపట్టారు. రోడ్డు మధ్య, రెండువైపులా పోగడ, ఫిలీషియం, కోసోకార్పస్, తోకోస్వర్మమ్మం, కోరియాడ, దురంత, అకాలిషా, మోడ, అటర్మనెలియా, బోగన్విలియ, మెంటాలి తదితర 5 లక్షల 17 వేల మొక్కలు నాటారు. వీటిలో సుమారు లక్ష వరకు పూల మొక్కలు ఉన్నాయి. మరో ఏడాదిలోపు 5 లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
యాదగిరిగుట్ట పంచనారసింహుడి క్షేత్రం పునర్నిర్మాణంతో ఈ మార్గంలో రాకపోకలు బాగా పెరిగాయి. సీఎం కేసీఆర్ క్షేత్ర అభివృద్ధి పనుల పర్యవేక్షణకు వచ్చిపోతుండడంతో హెచ్ఎండీఏ అధికారులు ఈ మార్గాన్ని హరితమయం చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రోడ్డు మధ్యన, రెండువైపులా పెరుగుతున్న పూలు, పచ్చని మొక్కలు ఎంతో ఆహ్లాదాన్ని
పంచుతున్నాయి.
వరంగల్ రోడ్డుపై అన్నోజిగూడ నుంచి రాయగిరి వరకు 29 కిలోమీటర్ల మేర చేపట్టిన హరితహారం ప్రాజెక్టును హెచ్ఎండీఏ అధికారులు ప్రతినిత్యం పర్యవేక్షిస్తున్నారు. మొక్కల పెంపకం, ఎదుగుదల, గడ్డి తొలగింపు, నాటుకోని చోట్ల కొత్తవి నాటడం, మట్టి, ఎరువు వేయడం వంటి పనులను పర్యవేక్షిస్తారు.
వరంగల్ హైవేకు సమీపంలోని పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో హెచ్ఎండీఏ అధికారులు ట్రీ పార్కుల అభివృద్ధి చేపట్టారు. ఘట్కేసర్ మున్సిపాలిటీలో 5 పార్కులు, పోచారం మున్సిపాలిటీలో 2 పార్కులను వివిధ రకాలైన దాదాపు 10 వేల మొక్కలతో అభివృద్ధి చేశారు.
అన్నోజిగూడ నుంచి రాయగిరి వరకు హరిత రహదారిగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. 29 కిలోమీటర్ల పొడవునా రోడ్డు కిరువైపులా వివిధ రకాల మొక్కలు, పూల మొక్కలు పెంచుతున్నాం. వాహనదారులను ఆకర్షించేలా, ఆహ్లాదం పంచేలా ఈ మార్గాన్ని తీర్చిదిద్దుతున్నాం.
-విజయభాస్కర్,హెచ్ఎండీఏ ఘట్కేసర్ ఏరియా మేనేజర్