Gambling | దుండిగల్/ జగద్గిరిగుట్ట, ఏప్రిల్ 14: సూరారం పోలీస్ స్టేషన్ పరిధి ,సూరారం మెయిన్ రోడ్డుపై మూడు ముక్కలాట యధేచ్చగా కొనసాగుతోంది. స్థానిక సాయిపూజ థియేటర్ పక్కన, మల్లారెడ్డి వైద్యశాల ఎదురుగా జరుగుతున్న ఈ జూదంపై పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తుండటంతో జూదగాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
ఫలితంగా వాహనదారులు, ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన ఆరు నెలలకు పైగా ఇక్కడ జూదం సాగుతుందని.. ఈ విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే నిర్వాహకులు బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు అంటున్నారు.
చూసేవారికి సులువుగా డబ్బులు వచ్చేలా..
సరదాగా సినిమాకు వచ్చే ప్రజలతోపాటు, సమీపంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీ, నారాయణ వైద్యశాలకు వచ్చే రోగుల సహాయకులను జూదగాళ్లు తమ వలలో వేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా తమలో తామే మూడు ముక్కలు ఆడుతున్నట్లు మొదలెడతారు. చూసేవారికి సులువుగా డబ్బులు గెలుచుకోవచ్చు అనేలా భ్రమ కల్పిస్తారు.
జనం పోగయ్యాక డబ్బులు తమకే వచ్చేలా మోసం చేస్తున్నారు. ఇందులో ఇద్దరు జూదం నిర్వహిస్తుండగా, మరో ఇద్దరు పోలీసులు గానీ వస్తున్నారా..? అనేది చూసేందుకు కాపలాగా ఉంటారు. ఈ వ్యవహారంపై పోలీసులు సైతం చూసి చూడనట్టు వ్యవహరిస్తుండడంతో గత కొంతకాలంగా యధేచ్చగా ఇక్కడ జూదం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆన్ లైన్ జూదం, బెట్టింగ్ యాప్లతో కొందరు ప్రాణాలే తీసుకుంటున్న నేపథ్యంలో రోడ్డుపై జరిగే ఇటువంటి జూదాన్ని సైతం నియంత్రించాల్సిన అవసరం ఉంది జనాలు అంటున్నారు. ఇదే విషయమై సూరారం పోలీసులను వివరణ కోరగా.. నెల రోజుల క్రితమే జూదగాళ్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. మరోసారి ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం జరుగుతున్నవి తమ దృష్టికి రాలేదన్నారు.