Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, ఏప్రిల్ 23 : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేనందున మర్రి రాజశేఖర్ రెడ్డి చెట్టు కింద కూర్చుని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు తెలియజేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లోని మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లేకపోవడంతో మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ కార్యాలయం వద్ద చెట్టు కింద టేబుల్ కుర్చీ వేసుకొని ప్రజలు ఇచ్చే అర్జీలను ప్రజా సమస్యలను తెలుసుకున్నానని అన్నారు. సంబంధిత అధికారులకు తెలియజేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో వారి అర్జీలను తెలుసుకుంటూ ఇందులో ముఖ్యంగా ప్రజా పాలనలో ప్రభుత్వం ఇచ్చిన హామీ గ్యాస్ సబ్సిడీ , 200 యూనిట్లలోపు కరెంటు బిల్లు సబ్సిడీ నెరవేరకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వికలాంగులకు సదరం సర్టిఫికెట్ అందించడం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్కీముల ద్వారా వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కోవడం, అర్హులైన పేదలకు పెన్షన్లు అందకపోవడం, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డులు రావడంలేదని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు వస్తాయని, రాజీవ్ యువ వికాస్ పథకాలు ఎప్పుడు అందుతాయని ప్రజలు అడుగుతున్నారని మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే దాటవేత ధోరణిలో సమాధానాలు చెబుతున్నారని, ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మించి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యేని కలిసి విన్నవించుకునేందుకు ఏర్పాటు చేశారని అన్నారు. కానీ మల్కాజిగిరి నియోజకవర్గంలో ఇంత వరకు క్యాంప్ ఆఫీస్ లేకపోవడంతో కలెక్టర్ దృష్టికి, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు, అక్కడి అడిషనల్ కమిషనర్ (ఎస్టేట్స్), జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌కు తెలియజేయాలని తిప్పుతున్నారు తప్ప పనులు మాత్రం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకి ప్రభుత్వ వ్యక్తిగత సహాయకున్ని (PA) కేటాయించాలని అసెంబ్లీ సెక్రటరీ, జీఏడీ, అధికారులకు తెలియజేసిన స్పందన లేకపోవడంతో మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ముందు చెట్టు కింద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే ఆ సర్కిల్ కార్యాలయంలో అవసరమైతే కలెక్టర్ కార్యాలయం సమీపంలో కూర్చొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.