Harish Rao | దుండిగల్, ఫిబ్రవరి 28: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. హరీశ్‌రావుతో పాటు ఆయన అనుచరులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు ఏ 1గా వంశీకృష్ణ, ఏ2గా హరీశ్‌రావు, ఏ3గా సంతోశ్‌కుమార్, ఏ4గా పరశురాములు పేర్లను బాచుపల్లి పోలీసులు చేర్చినట్లు తెలుస్తోంది. హరీశ్‌రావుపై 351 (2) R/W 3, (5) BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఈ విషయాన్ని నిర్ధారించలేదు.
హరీశ్‌రావు మంత్రిగా ఉన్న సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఇప్పటికే సిద్దిపేటకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నేత గాదగోని చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో 120(బీ), 386, 409, 506ఆర్/డబ్ల్యూ, 34ఐపీసీ, 66 ఐటీ యాక్ట్ ప్రకారం హరీశ్‌రావుపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని హరీశ్‌రావు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ హైకోర్టులో ఇంకా కొనసాగుతోంది.