ఘట్కేసర్, మే 3: ఘట్ కేసర్ మున్సిపాలిటీ బొక్కొనిగూడకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, శుభమస్తు ఇన్ఫ్రా గ్రూప్ చైర్మన్ బొక్క విష్ణువర్ధన్ రెడ్డి చేస్తున్న సామాజిక సేవలకు గాను గౌరవ డాక్టరేట్ లభించింది. తమిళనాడు రాష్ట్ర హోసూర్ పట్టణంలో జరిగిన ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ నిర్వహించిన కార్యక్రమంలో బొక్క విష్ణువర్ధన్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ పట్టాను అందించి గౌరవించారు. తనకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి గత కొన్ని సంవత్సరాలుగా అక్షర ఫౌండేషన్ సంస్థను స్థాపించి పేద ప్రజలకు సామాజిక, ఆర్థిక, వైద్య పరంగా, కరోనా సమయంలో వందల మందికి అందించిన సేవలను గుర్తించటంతోపాటు తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు అన్ని రకాల ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ (కోచింగ్) అందిస్తున్నందుకు గాను ఆ సంస్థ గుర్తించి గౌరవ డాక్టరేట్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టరేట్ రావడం పట్ల ఆనందంగా ఉందని, మరింత సామాజిక సేవ చేసే రెట్టింపు బాధ్యత పెరిగిందని తెలిపారు.. డాక్టరేట్ పట్టా అందించిన ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీకి కృతజ్ఞతలు తెలిపారు.