సిటీబ్యూరో, సెప్టెంబరు 30 (నమస్తే తెలంగాణ): కలిసి మద్యం సేవించారు. మత్తులో వాహనం నడుపొద్దని తెలిసీ ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారు. దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో కొద్దిరోజుల కిందట ఐదుగురు వ్యక్తులు మద్యం సేవించి ఆటోలో వెళ్తూ పాదచారిని ఢీకొట్టగా మృతిచెందాడు. పోలీసులు మద్యం తాగి ఆటో నడుపుతున్న ఆశిష్‌కుమార్‌ను అరెస్టు చేయగా తాజాగా ప్రమాదం జరిగిన రోజు అతడితో కలిసి మద్యం సేవించిన స్నేహితులు మనీష్‌కుమార్, రవిశంకర్, రాజేంద్రకుమార్, అమిత్కుమార్లను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆశిష్కుమార్కు డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా ఆటో కిరాయికిచ్చిన యజమాని పద్మారావు కోసం గాలిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపిస్తున్నాడని తెలిసి ప్రయాణించడం లేదా అందరూ కలిసి మద్యం మత్తులో వెళ్లడం నేరం. వీరిపై సెక్షన్ 304 పార్ట్-2 (చంపాలని ఉద్దేశం లేదు.. తనచర్య వల్ల మరణం సంభవిస్తుందని తెలిసి వ్యవహరించడం. నేరం రుజువైతే 10 ఏండ్లు జైలు)తోపాటు పలు అభియోగాలు నమోదు చేశారు.