ఘట్కేసర్, డిసెంబర్ 31: ముందుగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని అతివేగంగా ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఓ ప్రైవేట్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధి జోడిమెట్ల వద్ద బుధవారం జరిగింది. ఇన్స్పెక్టర్ బి రాజువర్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోచారం ఐటీసీ పోలీసు స్టేషన్ పరిధి జోడిమెట్ల చౌరస్తా వద్ద వెంకటాపూర్‌కు చెందిన ఈగ మహేష్(28) స్థానిక మేధా కంపెనీలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.
బుధవారం ఉదయం విధుల నిమిత్తం ద్విచక్రవాహనంపై జోడిమెట్ల లోని చౌరస్తా వద్ద తన ద్విచక్రవాహనంపై మలుపు తిరుగుతుండగా వెనుకాల నుండి వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో తీవ్ర రక్త గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.