మేడ్చల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 12 : సకాలంలో ప్రాథమిక చికిత్సను అందించిన 108 సిబ్బంది తల్లిని బిడ్డలను (కవల పిల్లలు) క్షేమంగా కాపాడారు. ఈ సంఘటన దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని రామలింగేశ్వర నగర్లో ఆదివారం చోటుచేసుకుంది. రామలింగేశ్వర కాలనీకి చెందిన రాధిక నిండు గర్భవతి. ఆదివారం బీపీ పెరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెకు మూర్చ రావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటీ రవి ఆమెకు ప్రాథమిక చికిత్సను అందించారు. అనంతరం 108 వాహనంలో దవాఖానకు తరలిస్తుండగా మరోసారి బీపీ పెరిగి ఫిట్స్ వచ్చాయి. తల్లికి, పిల్లలకు ప్రాణాపాయం ఉందని గ్రహించిన 108 సిబ్బంది వెంటనే డాక్టర్ ఆలంకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. డాక్టర్ సూచనల మేరకు ఇంజక్షన్ ఇవ్వడంతో ఫిట్స్ తగ్గి బీపీ కూడా అదుపులోకి వచ్చింది. ఆమెను నగరంలోని కోఠి దవాఖానకు తరలించడంతో కవల పిల్లలకు జన్మనిచ్చింది. వైద్యులు గుడ్ సర్వీస్ అని రాసి, 108 సిబ్బంది రవి, ఆంజనేయులును అభినందించారు. కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.