మొయినాబాద్, ఫిబ్రవరి 11 : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టా గ్రామ రెవెన్యూలో ఓ వ్యవసాయ క్షేత్రంలో భారీఎత్తున కోడి పందేలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన వ్యక్తులు పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారని ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో కోళ్ల పందేల శిబిరంపై పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. కోడి పందేలు అడుతున్నారని తెలియడంతో రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తమ 50 మంది సిబ్బందితో కోడి పందేల శిబిరానికి చేరుకున్నారు.
పోలీసులు వ్యవసాయ క్షేత్రంలోనికి వెళ్లేసరికి పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహించడంతో పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు.పోలీసులు వ్యవసాయ క్షేత్రంలో భారీగా మోహరించడంతో కోడి పందేల నిర్వాహకుడు భూపతిరాజు శివకుమార్‌వర్మ, పందెంరాయుళ్లు ఎటూ పోకుండా పోలీసులు చుట్టుముట్టి వారిని నిర్బంధించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శివకుమార్ 64 మంది పందెం రాయుళ్లు, 80 కోళ్లతో కోడి పందేలు నిర్వహించారు. కోడి పందేళ్లను ఆడించడానికి బెట్టింగ్ రూ.30 లక్షలు పెట్టినట్టు సమాచారం. కోడి పందేలు ఆడుతున్న వారి నుంచి రూ.30 లక్షలు, 80 కోళ్లు, 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలలో పాల్గొన్న 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.