బడంగ్పేట్, జనవరి2 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి మాలలకు(Mala community) తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్(Mandala Bhaskar) మండి పడ్డారు. మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ గాయిత్రీనగర్లోని సమతాభవన్లో బీమా కోరేగావ్ విజయేత్సవ సమావేశం బడంగ్పేట్ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు పరమేశ్, మహేశ్ అధ్యక్షతలో నిర్వహించారు. ఈ సందర్భంగా మందాల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలల స్థితి గతులపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకుండనే వర్గీకరణ చేశారని ఆయన తుప్పు పట్టారు.
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాలల పై కక్షపూరితంగా వ్యహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్లో ఉన్న మాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వర్గీకరణ పై నోరు మెదపలేదని విమర్శించారు. రోస్టర్ విధానంలో మాలలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఏ ప్రాతిపాదిక లేకుండానే వర్గీకరణ చేశారని మండిపడ్డారు. మాలలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ పార్టీ నాయకులను ఎక్కడికి అక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. న్యాయం జరిగే వరకు పోరాట ఆగదన్నారు.
బీమా కోరేగావ్ వీరుల స్ఫూర్తితో పోరాటం చేస్తామన్నారు. 1818లోనే 5000 మంది మహార్ సైన్యం 28000వేల పీశ్వాసైన్యాన్ని ఓడించిన ఘన చరిత్ర ఉందన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పోరాట పటిమ మాలో ఉందన్నారు. మాలలకు న్యాయం జరిగే వరకు పోరాట ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల నాయకులు డాక్టర్ మల్లేష్, రాకేష్, అంజనేయులు, కృష్ణ, డి రాములు,స్వామి, గాయాలు, గోరటి రమేష్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.