మొయినాబాద్, జనవరి 7 : చిలుకూరు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ మల్లేశ్, ఎంపీపీ నక్షత్రం, చిలుకూరు సర్పంచ్ స్వరూప, మాజీ ఉపసర్పంచ్లు ఆండ్రూ, గోపాల్‌రెడ్డి, నర్సింహాగౌడ్, ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
శివసత్తుల పూనకాలు… పోతురాజుల విన్యాసాలు… డప్పుల దరువులు… డోలువాయిద్యాల మధ్య మహిళలు బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. మల్లికార్జున స్వామితో పాటు ఎల్లమ్మకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. చిలుకూరు, ముర్తుజాగూడ గ్రామాలకు చెందిన భక్తులు అన్నదానం ఏర్పాటు చేశారు.
సీఐ పవన్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాల్లో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్‌యాదవ్, కాంగ్రెస్ చేవెళ్ల ఇన్చార్జి భీంభరత్, నేతలు శ్రీరాములు, మల్లారెడ్డి, నరేందర్, జయవంత్, సుభాష్‌గౌడ్, యాదయ్య, శ్రీనివాస్‌గౌడ్, నవీన్‌కుమార్, మాజీ సర్పంచ్‌లు రామకృష్ణాగౌడ్, రాంచంద్రయ్య, మాజీ ఉపసర్పంచ్ అంజిరెడ్డి పాల్గొన్నారు.