షాద్‌నగర్‌టౌన్, జనవరి 9 : ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ సర్కార్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కంటి వెలుగు సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలందరికి కంటి పరీక్షలు చేయడంతోపాటు లోపాన్ని గుర్తించి అద్దాలు ఇస్తారన్నారు. రెండో విడుత కంటి వెలుగు ఈ నెల 18 నుంచి ప్రారంభమై 100 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు పట్టణ ప్రజలకు కంటి వెలుగుపై అవగాహన కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మొదటి విడుత కంటి వెలుగులో షాద్‌నగర్ డివిజన్లో లక్షా169వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 18197 మందికి కంటి అద్దాలను అందజేశారన్నారు.
ఆర్డీవో రాజేశ్వరి, డిప్యూటీ డీఎంహెచ్‌వో జయలక్ష్మి మాట్లాడుతూ.. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంలో 18 సంవత్సరాల పైబడిన వారందరికి కంటి పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. కంటి వెలుగుకు సంబంధించి షాద్‌నగర్ డివిజన్లో 10 టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక్కో టీమ్‌లో మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్, ఆప్తామాలజిస్ట్, డీఈవో, ఇద్దరు ఏఎన్‌ంలు, ముగ్గురు ఆశాలు ఉంటారని వివరించారు. ప్రతి రోజూ గ్రామీణ ప్రాంతాల్లో 300 మందికి, మున్సిపాలిటీలో 400 మందికిపైగా కంటి పరీక్ష చేస్తారని పేర్కొన్నారు. ఆధార్‌కార్డుతో రిజిస్ట్రేషన్ చేసి కంటి పరీక్షలు చేస్తారన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేష్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, వైస్ ఎంపీపీ మౌనిక, ఎంపీడీవో వినయ్, తహసీల్దార్ గోపాల్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, వ్యవసాయశాఖ ఏడీ రాజారత్నం, మండల వ్యవసాయాధికారి నిశాంత్, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, వైద్యులు పాల్గొన్నారు.
షాబాద్‌లో..
షాబాద్ : రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని షాబాద్ ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి అన్నారు. షాబాద్ మండల పరిషత్తు కార్యాలయం సమావేశ మందిరంలో కంటి వెలుగుపై ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, ఎంఈవో శంకర్‌రాథోడ్, ఎంపీవో మధుసూదరెడ్డి, డాక్టర్లు, సర్పంచులు, మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అయూబ్, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నం : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి నిర్వహించనున్న రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది, పలువురు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలోని ప్రతి వార్డు ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, తహసీల్దార్ రామ్మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో ధరణికుమార్, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలో..
ఇబ్రహీంపట్నంరూరల్ : ఈ నెల 18న మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్ అన్నారు. ఇబ్రహీంపట్నం మం డల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటప్రతాప్‌రెడ్డి, ఎంపీడీవో జైరాంవిజయ్, సీడీపీవో శాంతిశ్రీ, ఎంపీవో లక్పతినాయక్, అధికారులు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
శంకర్‌పల్లిలో..
శంకర్పల్లి : రాష్ట్రంలో కంటి సమస్యలతో ఎవ్వరూ బాధపడకూడదని సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని శంకర్పల్లి ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య, మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్లు, పంచాయితీ కార్యదర్శులున్నారు.
కడ్తాల్‌లో..
కడ్తాల్ : ప్రభుత్వం ఈ నెల 18న చేపట్టనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి విజయవంతం చేయాలని ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, ఎంపీడీవో రామకృష్ణ, ఏంపీవో మధుసూదనాచారి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేటలో..
పెద్దఅంబర్‌పేట : ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరమని మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న పేర్కొన్నారు. తట్టిఅన్నారంలోని వార్డు కార్యాలయంలో స్వప్న అధ్యక్షతన కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశమైంది. సమావేశంలో కమిషనర్ సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు, మేనేజర్ నాగేంద్రబాబు, డీఈఈ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
కేశంపేటలో..
కేశంపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విశాల, వైస్ ఎంపీపీ అనురాధ, వైద్యశాఖ హెచ్‌ఈవో ఆంజనేయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆమనగల్లులో..
ఆమనగల్లు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును విజయవంతం చేయాలని ఎంపీపీ నేనావత్ అనిత అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రభుత్వ వైద్యులు, ఆశ వర్కర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు పరీక్షలు నిర్వహిస్తారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఫారూఖ్హేస్సేన్, ఎంపీవో శ్రీలత, ఎంపీటీసీ మంగమ్మ, మేడిగడ్డ సర్పంచ్ అంబర్‌సింగ్ పాల్గొన్నారు.
కొత్తూరులో..
కొత్తూరు : మండల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శరత్ చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వెలుగు సమీక్ష సమావేశానికి ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో కొత్తూరు మున్సిపల్ కమిషనర్ వీరేందర్, తహసీల్దార్ రాములు, మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నందిగామలో..
నందిగామ : కంటి వెలుగును అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసి విజయవంతం చేద్దామని నందిగామ ఎంపీపీ ప్రియాంకగౌడ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఎంపీడీవో బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వెలుగు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.