జవహర్నగర్, ఆగస్టు 28: టెక్నాలజీలో దేశం కొత్త పుంతలు తొక్కుతోందని, ప్రజా రవాణాలో సాంకేతికత తోడైతే ప్రమాదాలు 100 శాతం నివారించవచ్చని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. సోమవారం బిట్స్ పిలానీ క్యాంపస్లో “టెక్నాలజీస్ ఫర్ అర్బన్ ట్రాన్సిట్ టు ఎన్హాన్స్ మొబిలిటీ అండ్ సేఫ్ యాక్సెసిబిలిటీ” వర్క్షాప్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ అంజనీకుమార్ హాజరై వర్క్షాప్ను ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక కాలంలో ప్రతి వస్తువు టెక్నాలజీతో ముడిపడి ఉన్నదని, రవాణా వ్యవస్థలో ప్రమాదాల నివారణకు సాంకేతికత తోడైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు.
సిగ్నళ్ల వద్ద గంటల కొద్ది ఆలస్యం అవుతున్నదని, మరింత టెక్నాలజీతో రవాణాలో రందిలేకుండా చేయవచ్చని తెలిపారు. వృద్ధులు, స్కూలు పిల్లల కోసం రోడ్డు క్రాస్ చేయడానికి ప్రత్యేకమైన టెక్నాలజిని ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వి.ఎస్.రెడ్డి, బిట్స్ పిలానీ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.సుందర్, డీన్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ యోగీశ్వరి, ఐఐటీ బాంబే ప్రొఫెసర్ అవిజిత్ మాజి, ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ అర్కోపాల్ గోస్వామి, బిట్స్ పిలానీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.