రంగారెడ్డి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : మొక్కజొన్న పంట చేతికొచ్చినా..ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడ విక్రయించాలో తెలియక అన్నదాతలు తమ పంటను పొలంలో ఉంచారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు మొక్కజొన్న పంటే ప్రధాన ఆధారం. ఈ సీజన్లో జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో ఈ పంటను సాగుచేశారు. అందులో అత్యధికంగా షాద్‌నగర్ డివిజన్ పరిధిలోనే 16 వేల ఎకరాలకు పైగానే ఉన్నది. ఈ డివిజన్లో 4 లక్షల క్వింటాళ్లకు పైగా పంట దిగుబడి వచ్చే అవకాశముందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, ఆమనగల్లు, మహేశ్వరం, చేవెళ్ల డివిజన్లల్లోనూ దీనిని అధికంగా సాగు చేశారు. పంట అన్నదాతల చేతికొచ్చినా ప్రభు త్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో మధ్య దళారులకు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుందని.. వెంట నే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్ద తు ధర అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలోని షాద్‌నగర్, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, నందిగామ, కొత్తూరు, ఆమనగల్లు, కడ్తాల్, మహేశ్వరం, తలకొండపల్లి, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి తదితర మండలాల్లో 30 వేల ఎకరాల్లో ఈ పంటను రైతులు సాగు చేశారు. షాద్‌నగర్ డివిజన్‌లోనే సుమా రు 16,600ఎకరాల్లో అలాగే, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్లలో మరో 10 వేలకు పైగా ఎకరాల్లో ఈ పంటను సాగుచేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 5 లక్షలకు పైగా క్వింటాళ్ల మొక్కజొన్న పంట దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కాగా, ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. కేశంపేటలో మాత్రం మంగళవారం కేంద్రాలను ఏర్పాటు చేయినా కొనుగోళ్లు మాత్రం ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పంట చేతికొచ్చినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతకు మద్దతు ధర లభించటంలేదు. మొక్కజొన్న క్వింటాల్‌కు ప్రభుత్వం రూ. 2400గా మద్దతు ధర ప్రకటించింది. కానీ, కొనుగోలు కేంద్రాల్లేక బహిరంగ మార్కెట్లో వ్యాపారులు, మధ్యదళారులు క్వింటాల్‌కు రూ.1800లు మాత్రమే చెల్లిస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. అలాగే, వరి పంట కూడా చేతికందే సమయం ఆసన్నమైంది. ఈ పంటకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధర ప్రకటించినా ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల ఊసే లేకపోవడంతో రైతులు తక్కువ ధరకు వడ్లను మధ్యదళారులకు విక్రయించి నష్టపోతున్నారు.
నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశా. పంట కోత దశకు వచ్చి ఇరవై రోజులు దాటింది. మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. వ్యాపారులు, మధ్యదళారులు క్వింటాల్‌కు రూ.1,800లకు కొం టున్నారు. వారికి పంటను అమ్మితే పెట్టిన పెట్టుబడి కూడా రాదు. తీసుకొచ్చిన అప్పులను ఎలా తీర్చాలి. కూలీలకు డబ్బులు ఎలా చెల్లించాలో అర్థం కావడంలేదు. ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు పంటను కొనాలి. -జీ అంజయ్యయాదవ్, కడ్తాల్
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నా. నేను ఎకరాన్నరలో మొక్కజొన్న పంటను సాగు చేశా. పంట చేతికొచ్చినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో మక్క కంకులను పొలంలో అలాగే వదిలేశా. దళారులకు విక్రయిస్తే తక్కువ ధర చెల్లిస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా కనిపించడంలేదు. ప్రభుత్వ స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి.
-పర్వతాలు, కడ్తాల్ గ్రామం