కొత్తూరు, జనవరి 18 : జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఉర్సు చివరి రోజు మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మసియుల్లాఖాన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. దర్గా అభివృద్ధికి గతంలో 50 ఏండ్లు, ప్రస్తుతం 13 నెలలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రమూ కృషి చేయలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దర్గాలో ఏ మాత్రం అభివృద్ధి జరుగలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దర్గాను బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. దర్గా అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు కేటాయించారని చెప్పారు. జేపీ దర్గాను సందర్శించిన ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారు. వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ మసియుల్లాఖాన్, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ దర్గా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దర్గా అభివృద్ధి కోసం కేటాయించిన రూ. 50 కోట్లు వక్ఫ్ బోర్డు ఖాతాలోనే ఉన్నాయిని వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మసియుల్లా ఖాన్ తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనైతే ఆ డబ్బులతో దర్గా మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దర్గా అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
దర్గా అభివృద్ధికి అప్పటి సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు కేటాయించారని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు. చిరు వ్యాపారులకు నష్టం జరుగకుండా ఉండేందుకు మాస్టర్ ప్లాన్ అమలు ఆలస్యమైందన్నారు. అందుకోసం దర్గా చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలను గుర్తించి దర్గా అభివృద్ధికి మరొక ప్లాన్ అమలు చేయాలని యోచించామన్నారు. ముఖ్యంగా చెరువు కట్ట అభివృద్ధి తదితర పనులు చేపట్టామన్నారు. ఈలోపే ఎన్నికలు వచ్చాయన్నారు. దర్గాలో రోడ్లు బీఆర్ఎస్ హయాంలోనే వేశామని చెప్పారు. అలాగే దర్గాకు మిషన్ భరీరథ నీరు తెచ్చింది తామే అని చెప్పారు. దర్గాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా తమ హయాంలోనే పూర్తి చేశామని చెప్పారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, రాంపాల్ నాయక్ మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదలైన నిధులతో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేపడుతున్నదని చెప్పారు. అదనంగా ఒక్క కొత్త పని ఏమైనా తెచ్చారా వారు ప్రశ్నించారు. అందుకోసం తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకలు నారాయణరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, దేవేందర్‌యాదవ్, యాదగిరి, మాజీ సర్పంచ్‌లు మిట్టూనాయక్, అజయ్‌నాయక్, సత్తయ్య, శ్రీరాములుయాదవ్, లక్ష్మణ్‌నాయక్, శ్రీశైలం, గోపాల్‌నాయక్ పాల్గొన్నారు.