సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించడంలో యంత్రాంగం విఫలమైంది. సంస్థలో పనిచేసే ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ గడువు ముగిసి నెల రోజులు కావొస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఇటీవల ఓ శానిటేషన్ జవాన్‌కు గుండెపోటు రావడంతో స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. 5 లక్షలు అవుతుందని హాస్పిటల్ యాజమాన్యం తేల్చి చెప్పడంతో డబ్బులు కట్టలేక, ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆ కుటుంబం పడిన బాధలు అన్నీఇన్నీ కావు. గడిచిన నెల రోజులుగా వివిధ కారణాలతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మిగతా ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉందని, సంబంధిత అధికారులు పట్టించుకుని హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుని కొత్త సంస్థకు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవంగా బజాజ్ హెల్త్ ఇన్సూరెన్స్ గడువు గత ఫిబ్రవరి 14తో ముగిసింది. జీహెచ్ఎంసీ నుంచి ప్రీమియం కట్టకపోవడంతో రెన్యువల్ కాలేదు. కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ టెండర్లను పిలుస్తామని చెబుతున్నారే తప్ప..ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. అధికారుల కాలయాపనతో అనార్యోగానికి గురవుతున్న ఉద్యోగులకు హాస్పిటల్స్‌లో డబ్బులు కట్టలేక, వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2019 నుంచి హెల్త్ ఇన్సూరెన్స్..
2019 నుంచి జీహెచ్ఎంసీలో పనిచేసే ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు. అంతకుముందు ఉద్యోగులు హాస్పిటల్లో జాయిన్ అయితే.. ఆ బిల్లులు తీసుకొచ్చి క్లెయిమ్ చేసుకునేవారు. బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. దీంతో ఉద్యోగులకు అప్పటి కమిషనర్ లోకేశ్‌కుమార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు. మొదట హెల్త్ ఇన్సూరెన్స్ మూడు లక్షల వరకు కవర్ అయ్యేది.. ఆ తర్వాత 5 లక్షల వరకు కవర్ అయ్యేలా చేశారు. ప్రస్తుతం బజాజ్ హెల్త్ ఇన్సూరెన్స్ సరిగా పనిచేయడం లేదని, కొన్ని హాస్పిటల్స్ అంగీకరించడం లేదని ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఉన్న ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ను పది లక్షలకు పెంచాలని అధికారులను కోరారు.
ఉద్యోగులు ఆసుపత్రి పాలు
ఇటీవల శానిటేషన్ జవాన్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో ఖైరతాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నాలుగు స్టంట్స్ వేయాలని, ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని హాస్పిటల్ వర్గాలు శానిటేషన్ జవాన్ ఫ్యామిలీకి తెలిపారు. తమకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని హాస్పిటల్ వారికి ఇస్తే.. ఇది ఎక్స్పైర్ అయింది కాబట్టి చెల్లదు.. మొత్తం డబ్బులు కడితేనే చికిత్స చేస్తామని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక అప్పు చేసి ఇబ్బందులు పడిన పరిస్థితి. ఇలా వరుసగా కమిషనర్, అడ్మిన్ అడిషనల్ కమిషనర్ని కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పెద్ద పెద్ద ఏజెన్సీలకు ఎలాంటి పనులు చేయకపోయినా బిల్లులు వెంటనే మంజూరు చేస్తారని, కానీ ఇలాంటి వాటిని మాత్రం ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణ ఆరోపించారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపులోనూ ఇబ్బందులే..
జీహెచ్ఎంసీలో 30 సర్కిళ్ల పరిధిలో అత్యవసర సేవలతో పాటు ఆదాయం వచ్చే టౌన్‌ప్లానింగ్, ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్‌లు , ప్రకటనల విభాగంతోపాటు ఇతర విభాగాల్లో నాలుగు వేల మంది పర్మినెంట్ ఉద్యోగులుండగా ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో మరో 24 వేల మంది వివిధ రకాల విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఎక్కువ మందిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలతో సమకూర్చుకుంటున్నారు. మరికొన్ని విభాగాల్లో విభాగాధిపతులు నేరుగా కాంట్రాక్ట్ సంస్థలను సంప్రదించి తమ అవసరాలకు అనుకూలంగా కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఏజెన్సీలపై కమిషనర్ ఇలంబర్తి దృష్టికి ఈ అంశాన్ని పలువురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తీసుకువెళ్లగా .. కమిషనర్ స్పందించి విచారణకు ఆదేశించారు.