బొంరాస్‌పేట, మే 11 : లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడింది. ఐదు గంటలకే మైకులు మూగబోయాయి. దాదాపు నెల రోజులపాటు ఆయా పార్టీలు ప్రచారాన్ని జోరుగా నిర్వహించాయి. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉండగా, కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి, బీజేపీ నుంచి విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో ఉండగా.. మహబూబ్‌నగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్లలో బహిరంగసభ నిర్వహించి ప్రచారం చేశారు. అన్ని తానై మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి కాసానికి మద్దతుగా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. తాండూరులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, వికారాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కాసాని బీసీ నేత కావడంతో బీసీ నినాదాన్ని నేతలు ప్రచారంలో జనంలోకి బలంగా తీసుకెళ్లారు.
క్యాడర్ సైతం సమరోత్సాహంతో కాసాని గెలుపుకోసం కదం తొక్కింది. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి పవర్లోకి రావడం.. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం..అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. బీజేపీ పదేండ్ల పాలనలో తెలంగాణకు చేసిన అన్యాయాన్ని, మత పరంగా ఓట్లడిన తీరును బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు మెజార్టీ సాధించేలా కిందిస్థాయి శ్రేణులు కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. చివరి రోజైన శనివారం జిల్లాలో ప్రచారం హోరెత్తింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సీఎం రేవంత్‌రెడ్డి చేవెళ్ల, తాం డూరు, కొడంగల్‌లలో ప్రచారం నిర్వహించగా ప్రియాంకగాంధీ తాండూరు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రచారంలో పాల్గొన్నారు.