వికారాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫామ్‌ల్యాండ్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్న ఆ సంస్థల నిర్వాహకులు.. వారు కొనుగోలు చేసిన భూమితోపాటు పక్కనున్న భూములనూ కబ్జా చేస్తున్నారు. అంతేకాదు చెరువులు, నాలాలు, అసైన్డ్ భూములనూ వదలడం లేదు. అనుమతుల్లేకుండా లే అవుట్లు చేసి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టాన్ని కలిగిస్తున్నారు. ఇదంతా సంబంధిత స్థానిక అధికారుల అండదండలతోనే జరుగుతున్నదని స్థానికులు, ప్రజలు మండిప డుతున్నారు. తమ భూములను ఎం దుకు కబ్జా చేశారని ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారులకు ప్రతినెలా ముడుపులు అం దుతుండడంతో వారికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఏదో ఒక చోట రైతులకు అన్యాయం జరిగి జిల్లా ఉన్నతాధికారులను న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తే.. క్షేత్రస్థాయిలో ఆ అధికారులకే విచారణ బాధ్యతలను అప్పగిస్తుండడంతో రైతులకు న్యా యం జరుగడంలేదనే ఆరోపణలూ ఉన్నాయి. కాగా జిల్లాలోని పూడూ రు మండలంలోని ఎన్కెపల్లి గ్రామ పరిధిలో వెలిసిన మైరాన్ హోం రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులు కూడా అధికారులతో కుమ్మక్కై తమ భూమిని కాజేశారని ఆరోపిస్తూ పలు వురు రైతులు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు.
జిల్లాలోనే భూముల ధరలు అత్యధికంగా ఉండే పూడూరు మండలంలో ఏకంగా రూ.5 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ స్కెచ్ వేసిందనే ఆరోపణలున్నాయి. పూడూరు మండలంలోని ఎన్కెపల్లి గ్రామ పరిధిలో కేవలం ఎనిమిది ఎకరాలతో ప్రారంభమైన మైరాన్ హోం రియల్ ఎస్టేట్ సంస్థ తన వెంచర్‌ను 100 ఎకరాలకుపైగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా భూములను కొంటున్నది. అయితే తమ వెంచర్‌ను విస్తరించే క్రమంలో పక్కనే ఉన్న అమాయక రైతుల భూములను బెదిరించి ఆక్రమిస్తున్నదనే ఆరోపణలున్నాయి. ఈ కబ్జా వ్యవహారాన్ని స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులకు బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. ఎన్కెపల్లిలోని సర్వేనంబర్ 115లో మైరాన్ హోం లేఅవుట్‌ను డెవలప్ చేస్తున్నది. అయితే ఈ సర్వేనంబర్‌లో కుంతల భీమయ్య తండ్రి పోచయ్య పేరిట ఉన్న 20 గుంటలు, జూబ్బూరు నర్సమ్మ భర్త అనంతయ్య పేరిట ఉన్న 20 గుంటలు, నల్లోల బుజ్జమ్మ భర్త చంద్రయ్య పేరిట ఉన్న 20 గుంటల భూమిని మైరాన్ హోం సంస్థ కబ్జా చేసిందని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మన్నెగూడ పెంటయ్య తల్లి చందమ్మ పేరిట ఉన్న 2 ఎకరాలకు సంబంధించి 2001లో ఓఆర్సీ వచ్చిందని, 2024 ఫిబ్రవరి వరకు ఆన్లైన్లో తమ పేరిటే రికార్డులో ఉన్నదని బాధిత రైతు చెప్పాడు. అయితే చంద్రమ్మ భర్త లాలయ్య 1997లో మృతి చెందగా, 1998లో స్థానిక పట్వారీతో కుమ్మక్కై హైమద్ బాబా అనే వ్యక్తి తన కుమార్తెల పేరిట రెండెకరాలను బోగస్ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నాడు. లాలయ్య ఇల్లరికం రావడంతో అతడి పేరిట గుం ట భూమి కూడా లేదని.. అతడి సంతకాలతో బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి చంద్ర మ్మ పేరిట ఉన్న రెండెకరాలను ఆ క్రమించారని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా సర్వేనంబర్ 117లో జుబ్బూరు నర్సమ్మకు 1ఎకరా 26 గుంటల భూమి ఉన్నదని.. భర్త, కుమారుడు మృతిచెందడంతో ఆమె ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లగా బోగస్ పత్రాలతో ఎక రం రూ. రెండు కోట్ల వరకు ఉన్న దాదా పు మూడున్నర ఎకరాలను కబ్జా చేశారని.. తమ భూములు తమకు ఇప్పించాలని స్థానిక రెవెన్యూ అధికారులతోపాటు జిల్లా ఉన్నతాధికారుల చుట్టూ బాధితులు ప్రదక్షిణలు చేస్తున్నారు. రియల్టర్లు రైతుల భూముల్లోంచి రోడ్డు వేయడంతోపాటు బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్వీకుల నుంచి వస్తున్న భూమిని తమకు తెలియకుండా మైరాన్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులు కబ్జాచేసి లే అవుట్ చేస్తున్నారు. 115 సర్వే నంబర్లో 20 గుంటలు, 117 సర్వేనంబర్‌లో 1 ఎకరా26 గుంటల భూమి ఉన్నది. భర్త అనంతయ్య, మామయ్య లాల య్య గతంలోనే మృతి చెందారు. అప్పట్లో గ్రామ రెవెన్యూ కార్యదర్శిగా (పట్వారీ)గా పని చేసిన ఓ వ్యక్తి ఆన్లైన్ పద్ధతి రాకముందే నవాబులకు నకిలీ డాక్యుమెం ట్ చేసి విక్రయించాడు. తాను కొన్నేండ్లుగా హైదరాబాద్‌కు వలస వెళ్లి కూరగా యలు విక్రయిస్తూ జీవిస్తున్నా. తమ భూమిలో లే అవుట్ చేస్తున్నారని తెలిసి గ్రామానికి వచ్చా. అధికారులు స్పందించి భూములు ఇప్పించాలి.
-జూబ్బూరు నర్సమ్మ, ఎన్కెపల్లి గ్రామం, పూడూరు
తన తండ్రి లాలయ్య పేరుతో గుంట భూమి కూడాలేదు. ఆయన 1997 మృతి చెందితే .. కొందరు ఆయన పేరున భూమి ఉన్నట్లు 1998లో రిజిస్ట్రేషన్ చేసినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. లాలయ్య ఇల్లరికం రావడంతో తన తల్లి చంద్రమ్మ పేరున పూర్వీకుల నుంచి వచ్చిన సర్వేనంబర్ 115/6లో ఒక ఎకరా 26 గుంటల భూమి ఉన్నది. 2001లో ఓఆర్సీతోపాటు 2024 ఫిబ్రవరి 22 వరకు ఆన్లైన్లో ఆమె పేరుతోనే ఉన్నది. అనంతరం కొందరు కబ్జాకు పాల్పడి.. అధికారులతో కలిసి ఆన్లైన్ రికార్డుల నుంచి ఆమె పేరు ను తొలగించారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు డాక్యుమెంట్లు గుర్తించి న్యాయం చేయాలి.
– మన్నెగూడ పెంటయ్య, ఎన్కెపల్లి గ్రామం, పూడూరు