బంట్వారం, అక్టోబర్ 29 : రైతుల పేరున ఫోర్జరీ సంతకాలు, డాక్యుమెంట్లతో బ్యాంకు సిబ్బంది రుణాలు తీసుకున్న ఘటన మంగళవారం మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఇద్దరు రైతులు రుణాలు తీసుకుని రెన్యూవల్ కూడా చేశారు. కానీ, బ్యాంకుకు చెందిన అధికారులు సదరు రైతులకు ఫోన్లు చేసి మీ పేరున బ్యాంకులో అప్పు ఉన్నదని.. దానిని ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించడంతో బాధిత రైతులు ఆశ్చర్యపోయారు. బ్యాంక్‌కు వెళ్లి ఇప్పటికే తమ రుణాలను చెల్లిస్తే, ఇంకా అప్పు ఎందుకు ఉంటుందని సిబ్బందిని నిలదీశారు. ఒకే రైతు పేరున రెండు సార్లు రుణాలు తీసుకున్నట్లు సిబ్బంది చెప్పగా.. వాటిని సంబంధించిన వోచర్లు, రికార్డులను చూపాల ని అడిగితే మేనేజర్ నిరాకరించడంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నూరుళ్లపూర్ గ్రామానికి చెందిన రైతు షేక్ మఖీద్కు 4.35 ఎకరాల పొలం ఉన్నది. అతడు గత నాలుగేండ్లుగా తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణాలు తీసుకుంటూ రెన్యూవల్ కూడా చేస్తున్నాడు. ప్రతిసారి లాగే ఈ ఏడాది ఆగస్టు 19న కూడా రెన్యూవల్ చేశాడు. అయితే అతడికి బ్యాంకు సిబ్బంది ఫోన్ చేసి మీ పేరున రుణం ఉన్నదని పది రోజుల్లో రెన్యూవల్ చేయాలని చెప్పడంతో కంగుతిన్నాడు. మరుసటి రోజు బ్యాంకుకెళ్లి విచారించగా.. అక్కడ అతడి ఆధార్ కార్డు పెట్టి, ఫొటో ను అతడిది కాకుండా వేరే వారిది పెట్టి రూ.1,60,000 రుణం తీసుకున్నారు. అంతేకాకుండా మఖీద్ ఆంగ్లంలో సంతకం చేస్తాడు. ఫోర్జరీ డాక్యుమెంట్లు, విత్‌డ్రాలో వేలిముద్రలతో సంతకం చేసి డబ్బులు కాజేసినట్లు గుర్తించాడు. దీంతో అతడు దాని కాపీ, తన బ్యాంకు ఖాతా వివరాల రిపోర్టు ఇవ్వాలని పట్టుబట్టగా.. బ్యాంకు అధికారులు ఈ విషయంపై విచారిస్తామని.. కొన్ని రోజుల సమయం కావాలని అతడిని బతిమిలాడారు. ఆగస్టులో ఈ ఘటన జరుగగా..దాదాపుగా రెండు నెలల తర్వాత మంగళవారం మఖీద్ బ్యాంకుకెళ్లి మేనేజర్‌ను కలిశాడు. నీ పేరున డబ్బులు తీసుకున్న వారు బ్యాంకుకు చెల్లించారని, ఆ విషయం మరిచిపోవాలంటూ ఉచిత సలహా ఇచ్చాడు. తన పేరున జరిగిన ఫోర్జరీ లావాదేవీల వివరాలను చెప్పడంతోపాటు ఫోర్జరీ చేసిన వారి పేరు చెప్పాలని అతడు పట్టుబట్టగా మేనేజర్ ససేమిరా అనడంతో అతడు స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
మండలంలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన మర్పల్లి రాములు తనకున్న 2.20 ఎకరాల భూమిపై తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ. లక్ష రుణం తీసుకున్నాడు. దాన్ని తిరిగి రెన్యూవల్ కూడా చేశాడు. అయితే కొద్ది రోజుల కిందట బ్యాంకు సిబ్బంది ఫోన్ చేసి, మీరు తీసుకున్న రుణాన్ని వెంటనే చెల్లించాలని పేర్కొనడంతో అతడు కంగుతిని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రైతులను మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది ; మహిపాల్‌రెడ్డి ఎస్ఐ బంట్వారం
రైతులను మోసగించి, ఫోర్జరీ సంతకాలు, డాక్యుమెంట్లతో బ్యాంకు సిబ్బంది రుణాలు తీసుకున్నట్లు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు చేసి సమగ్ర విచార ణ జరుపుతాం. ఇలా ఎంతమంది రైతుల పేర్లతో రుణాలు తీసుకున్నారో తేల్చుతాం.