వికారాబాద్, ఆగస్టు 15,(నమస్తే తెలంగాణ): జిల్లాలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లావ్యాప్తంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అదేవిధంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ శాఖలకు చెందిన 289 మంది ఉద్యోగులకు స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తోపాటు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించారు. అయితే జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ జాతీయ జెండాను ఎగురవేశారు.
అదేవిధంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అదేవిధంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరం పాటుపడాలని, జిల్లా మరింత ప్రగతిపథంలో ముందుకెళ్లేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అయితే జిల్లాలో రుణమాఫీ పథకం కింద 1,00,358 మంది రైతులకు సంబంధించి రూ.849 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకంలో భాగంగా 2,76,537 మంది రైతులకు రూ.363 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా జిల్లాలో జిల్లాకు మంజూరైన 13,640 ఇండ్లలో ఇప్పటివరకు 10,885 ఇండ్లకు అనుమతులు మంజూరు చేశారని, వీటిలో 1277 ఇండ్లకు రూ.8.58 కోట్లను చెల్లించామన్నారు. అదేవిధంగా గిరిజనుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపర్చేందుకుగాను జిల్లాలోని చెంచు జాతులకు చెందిన వారికి 520 ఇండ్లు మంజూరు చేశామని స్పీకర్ వెల్లడించారు.
జిల్లాలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 4 కోట్ల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారన్నారు. గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 1,39,812 కుటుంబాలకు ఇప్పటివరకు రూ.47.93 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం అందజేసిందన్నారు. జిల్లాలో కొత్తగా 25,669 కొత్త రేషన్‌కార్డులను జారీ చేశారని, రైతుబీమా పథకంలో భాగంగా ఇప్పటివరకు 980 మంది రైతులు మరణించగా రూ.49 కోట్ల సాయాన్ని మృతి చెందిన రైతు కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేశారని ప్రసాద్‌కుమార్ తెలిపారు. అయితే సీఎంఆర్ఎఫ్ పథకం కింద జిల్లాలో 9808 మంది లబ్ధిదారులకు రూ.56.24 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేశారన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరపీ కాలేజీ నిర్మాణానికి రూ.197.50 కోట్లు మంజూరుకాగా, పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా తాండూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకుగాను రూ.7.32 కోట్లను మంజూరు చేశారన్నారు. అయితే అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో భాగంగా జిల్లాలోని 954 పాఠశాలల్లో రూ.17.55 కోట్లతో పనులు పూర్తి చేశామని, జిల్లాలోని 19 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యాబోధన ప్రారంభించినట్లు వెల్లడించారు.
జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం కింద 496 మంది లబ్ధిదారులకు రూ.4.96 కోట్లను, షాదీ ముబారక్ పథకం కింద 111 మంది లబ్ధిదారులకు రూ.1.11 కోట్లను అందజేశారన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహిస్తున్నామని, జిల్లాలో ఇప్పటివరకు 395 మంది 1510 ఎకరాల్లో మొక్కలను నాటారన్నారు. 2025-26 సంవత్సరంలో 99.76 శాతం పనిదినాలను కల్పించి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.90 కోట్లు, జుంటుపల్లి ప్రాజెక్టుకు రూ.5.71 కోట్లు, పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ. 1470 కోట్లు మంజూరుకాగా టెండర్ల దశలో ఉందన్నారు. పర్యాటకాభివృద్ధి కోసం రూ.10 కోట్లతో అనంతగిరి, కోట్‌పల్లి, గొట్లపల్లి అంతారం, బొంరాసుపేట్, జాఫర్పల్లిలో పట్టణ ఉద్యానవనాలు మంజూరయ్యాయన్నారు. అనంతగిరి హిల్స్‌ను రూ.వెయ్యి కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెగా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని, ఈ ప్రాజెక్టు ద్వారా 2-3 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని స్పీకర్ ప్రసాద్‌కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్‌చౌదరి, ఆయా శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.