ఆమనగల్లు, జనవరి 29 : ప్రజాయుద్ధ నౌక గద్దర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని ప్రముఖ న్యాయవాది లక్ష్మణశర్మ డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసిస్తూ ఆమనగల్లు బార్ అసోసియేషన్, గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ కల్వకుర్తి, తెలంగాణ జేఏసీ ఆమనగల్లు సంయుక్తంగా మండల పరిషత్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పీడిత, తాడిత ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన గద్దర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేంద్రంలోని బీజేపీ మతాల పేరిట, కులాల పేరిట రాజకీయాలు చేస్తూ దేశాన్ని అధోగతిపాలు చేస్తున్నదని ఆరోపించారు. దేశంలో ప్రశ్నించే నాయకులపై కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని వారు దుయ్యబట్టారు.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రమంతటా గద్దర్ అభిమానులు నిరసనలు చేపడుతారని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేసన్ అధ్యక్షుడు మల్లెపల్లి జగన్, నాయకులు ఎగిరిశెట్టి సత్యం, ఇజ్రాయిల్, శివలింగం, సుధాకార్, రజితక్క, నర్సింహ, భిక్షపతి, గోపాల్, శేఖర్, శ్రీను, శేఖర్, యాదయ్య, శంకర్, పుల్లయ్య, యాదయ్య, సురేశ్, శ్రీను పాల్గొన్నారు.