వికారాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): జిల్లాలో నిజాయితీనిబద్ధత కలిగిన పోలీసుల కంటే అవినీతి, అక్రమాలకు పా ల్పడే వారే ఎక్కువయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖనే కా కుండా అన్ని శాఖల్లోనూ అవినీతి, అక్రమా లు పెరిగిపోయాయనే ప్రచారం జరుగుతున్నది. భూముల ధరలు ఎక్కువగా ఉండే, సంపాదన వచ్చే ఠాణాలను ఎంచుకుంటున్న పలువురు సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు అక్కడ పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధులకు రూ. లక్షల్లో ముడుపులిస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు ఇచ్చిన డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు వారు సామాన్యులు, పేదలకు సేవ చేయకుండా సంపాదనే లక్ష్యంగా బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని.. స్థానిక ప్రజాప్రతినిధుల అండ తమకు ఉందని, తమను ఎవరూ ఏమీ చేయలేరని రెచ్చిపోతున్నట్లు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని కొన్ని ఠాణాలైతే సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయాయన్న ఆరోపణలు న్నాయి. సివిల్(భూతగాదాలు) వ్యవహారా ల్లో తలదూర్చొద్దంటూ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా కొందరు పోలీసు లు పట్టించుకోకపోవడం గమనార్హం. ఠాణా ల్లో జరుగుతున్న భూసెటిల్మెంట్లతో అమాయక పేదలకు అన్యాయం జరుగుతున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. డబ్బులిచ్చే వారివైపే నిలుస్తూ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వచ్చే పేదలకు అన్యాయం చే స్తూ పోలీస్ శాఖకు మాయని మచ్చగా కొం దరు పోలీసులు వ్యవహరిస్తుండడం విమర్శలను తావిస్తున్నది.
ఇటీవల జిల్లాలోని చా లా ఠాణాలకు కొత్త ఎస్‌హెచ్‌వోలను నియమించినా వారు కూడా భూసెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ ఠాణా పరిధిలో భూతగాదా విషయంలో పోలీసుల ముందే ఓ పార్టీ నాయకుడు బెదిరింపులకు పాల్పడుతూ యువకుడిపై దాడి చేయడం జి ల్లాలో చర్చానీయాంశంగా మారింది. అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసులపై సం బంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
అక్రమ సంపాదనకు అడ్డదారులు..
జిల్లాలోని పలు ఠాణాల్లోని ఎస్ఐలు, సీఐలు కాసుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలున్నాయి. వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా వారిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. జిల్లాలోని పలు శాఖల్లోని కొందరు అధికారులు లంచమిస్తేనే పని చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. భూతగాదాలు మొదలుకొని ఇసుక దందా వరకు పోలీసులు తలదూర్చుతుండడంతో వారిపై ప్రజల్లో నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతున్నది.
ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతూ ఠాణాలను సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చుతుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని యాలాల, తాండూరు మండలాల్లో ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తరలిస్తూ రూ. కోట్లు ఆర్జిస్తున్నది. ఈ దందాలో పోలీసుల ప్రమేయం ఉందనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతున్నది. ఒక్కో ట్రాక్టర్‌కు రూ. వేలలో వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇసు క మాఫియా ఇచ్చే డబ్బులు తీసుకుంటూ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డులేకుండా పోయిందని స్థానికులు మండిపడుతున్నారు.