కొడంగల్, ఆగస్టు 11 : సీఎం ఇలాకాలో అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ నాయకులు దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. మంగళవారం దుద్యాల మండలంలోని హకీంపేటలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం రైతుల నుంచి భూమిని తీసుకొని తక్కువ పరిహారం చెల్లించడంతోపాటు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని బాధితులు కూడలిలో నిరసన తెలిపారు. దీనికి పట్నం నరేందర్రెడ్డి హాజరై మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ గత రెండేండ్ల కిందటే హకీంపేట, పోలెపల్లి, లగచర్ల, పులిచెర్లకుంటతండా, రోటిబండ తండాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం భూసేకరణ చేసిందని.. ఫార్మా కంపెనీలతో ఈ ప్రాంతానికి ముప్పు వాటిల్లుతుందని రైతులు ధర్నాలు, నిరసనలు తెలపడంతో సర్కార్ వెనక్కితగ్గి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు జీవోను జారీ చేసిందన్నారు.
నిరసన తెలిపిన రైతులపై కక్షకట్టి కేసుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆరోపించారు. రైతులను బెదిరించి, ఉత్తిత్తి హామీలిచ్చి భూములను కైవసం చేసుకున్నదని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రాంతంలోని సర్వేనం. 252లో 200లపై చిలుకు ఎకరాల భూమి ఉండగా స్థానిక కాంగ్రెస్ నాయకులు అధికారులతో కుమ్మక్కై భారీగా ఎకరాలను తమ పేర్లతో అక్రమంగా రాయించుకుని అర్హులైన రైతులకు పరిహారం అందకపోగా.. హస్తం పార్టీ నాయకులకు మాత్రం కాసుల పంట పండిందని.. ఆ వచ్చిన మొత్తాన్ని రేవంత్రెడ్డి, తిరుపతిరెడ్డిలతోపాటు వారు పంచుకున్నట్టు ఆయన ఆరోపించారు. అప్పట్లోనే 252 సర్వేనం భూమిని పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు.
ఈ ప్రక్రియలో ఇంకా 34 మందికి పరిహారం అందా ల్సి ఉందని.. తమకు న్యాయం చేయాలని తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ వారు తిరిగినా ఫలితం లేదన్నారు. అదేవిధంగా రైతులకు ఆర్అండ్ఆర్ చట్టం ప్రకారం రావాల్సినవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నారు. ఏర్పాటు చేసిన వెంచర్లో ఇంటి స్థలాల్లో భారీగా కుంభకోణం జరిగిందని.. కాంగ్రెస్ బడా నాయకులు రోడ్డు పక్కన స్థలాలను ఎంపిక చేసుకొని పేద రైతులకు ఓ మారుమూలగా ప్లాట్లను కేటాయించినట్టు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ప్లాట్ల పంపిణీలో ఎవరికీ అనుమానం రాకుండా పథకం ప్రకారం అధికారులు ద్వారా లక్కీ డ్రా పేరుతో మోసపూరితంగా ప్లాట్లను కేటాయించారని దుయ్య బట్టారు. అన్యాయం అన్న ప్రతి రైతుపై ఇష్టానుసారంగా కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని.. ఎవరికి మొరపెట్టుకోవాలో అర్థం కాక వారు లోలోన మదనపడుతున్నారన్నారు. ప్లాట్ల పంపిణీలో పెద్ద స్కాం జరిగిందని.. రైతులు నోరు తెరవకుండా కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడటం చాలా దారుణంగా ఉందన్నారు.
అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, కానీ రైతులను నష్టపరిచేలా చర్యలు చేపడితే సహించేది లేదని, రైతు పక్షాన పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ ఎప్పటికీ ముందుంటుందని హెచ్చరించారు. భూమి కోల్పోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నష్ట పరిహారం అందించే వరకు రైతుకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు జరిపించి ప్రతి ఒక్కరిపై చట్టపరంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కారణంగా పేద రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకున్నప్పటికీ, నేటి వరకు ఆ ప్రాంతంలో ఏ ఒక్క కంపెనీ ఏర్పాటు జరిగిన దాఖలాలు లేవని, కంపెనీల పేరుతో కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ దందాకు పూనుకొంటున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాంతంలో బాదిత రైతులకు కేటాయించిన ప్లాట్లను కాంగ్రెస్ నాయకులు బెదిరించి తక్కువ ధర చెల్లించి ప్లాట్లను కైవసం చేసుకొంటున్న సందర్భాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిపారు. కాబట్టే ఒకప్పుడు సాధారణంగా ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు నేడు కోట్లలో పడగలెత్తుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా జరుగుతున్న మోసాలను సీఎం గుర్తించి జుడిషియల్ ఎన్క్వైరీ ఏర్పాటు చేసి నిజానిజాలను తేల్చాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు.
నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది. మొత్తంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో పోయింది. భూమికి నష్ట పరిహారం ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు నాకు అందలేదు. నేను వృద్ధుడిని, భూమి పోయిం ది, ఉపాధి పోయింది, బతుకే ఆగమైంది. భూమికి సంబంధించిన పుస్తకం, పహణీ ఉన్నది. అయినప్పటికీ నా పేరుపై భూమి లేదని అంటున్నారు. కోర్టుకు వెళ్లినా, కాగితాన్ని కలెక్టర్కు చూపించిన. భూమి లేదు.. నష్ట పరిహారం ఏవిధంగా వస్తుందని కలెక్టర్ అంటున్నారు. వస్తుందో లేదో కూడా తెలియడం లేదు. దయచేసి నాకు నష్ట పరిహారాన్ని అందించండి.
– బాల్రాజ్, బాధిత రైతు, హకీంపేట
12 ఎకరాలు భూమి ఉంటే ఒక ఎకరం ఉన్నట్లుగా గుర్తించి నష్టపరిహారాన్ని అందించారు. భూమికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నా.. ఎకరాకే నష్టపరిహారాన్ని అందిస్తామని అధికారులు తెలిపారు. భర్త లేడు. మాకు ఎటువంటి ఆసరా లేదు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. భూమిపైనే మా ఆధారం. భూమి పుస్తకం ఇవ్వడం లేదు. న్యాయం కోసం మాట్లాడేవారు మాకు ఎవరూ లేరు. మేం ఆడవాళ్లం.. ఎవరిని కలవాలి, ఎవరితో మా గోడు చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మా భూమి ఎంత పోయిందో అంత మేరకు నష్టపరిహారమివ్వాలని సీఎంను కోరుతున్నాం.
– బాబమ్మ, బాధిత రైతు, హకీంపేట
సర్వే నం.252లో భూమి నిజానికి ఉన్నది 250 ఎకరాలు మాత్రమే, దాన్ని స్థానిక కొంత మంది నాయకులు భూమి లేకున్నా 519 ఎకరాల పట్టాలను సృష్టించారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు విడుదలైన నోటిఫికేషన్లో వారి పేర్లను నమోదు చేయించుకొని నష్ట పరిహారాన్ని అందుకొంటున్నారు. నాకు ఇదే సర్వే నంబర్లో 2 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నది. 20 గుంటలు నాలా మార్పిడి చేసుకున్నా. కానీ నాలాకు సంబంధించి నష్ట పరిహారం ఇవ్వలేదు. ఎకరం భూమికి మాత్రమే నష్ట పరిహారాన్ని అందించారు. ఇదేం న్యాయమని అధికారులను అడిగితే.. నష్ట పరిహారం కావాలంటే సంతకం పెట్టాల్సిందే అని చెప్పారు.
– శివకుమార్, బాధిత రైతు, హకీంపేట