జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు అక్రమార్కులతో కలిసి విలువైన భూములను కాజేస్తున్నారు. దీంతో జిల్లాలో తరచూ భూతగాదాలు, ఘర్షణలు జరిగి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నది. ముఖ్యంగా జిల్లాలోని ఔటర్‌రింగ్‌రోడ్డు పరిసర గ్రామాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. పెరిగిన భూములను కాజేసేందుకు అనేకమంది అక్రమార్కులు రంగంలోకి దిగుతున్నారు. వీరు రాజకీయ నాయకుల అండదండలతో పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే అర్హులకు అన్యాయం జరుగుతున్నదన్న ఆరోపణలున్నాయి.
ఒకచోట సర్వే నంబర్లు.. మరోచోట పొసెషన్లు ఉండడంతో సాంకేతిక సమస్యలను సాకుగా చూపి భూములను కాజేస్తున్నారు. మరోవైపు విక్రయించిన భూములపై అమ్మినవారికే మళ్లీ పాస్‌బుక్కులు రావడంతో.. పాస్‌బుక్కులు వచ్చిన వారి నుంచి అక్రమార్కులు తక్కువ ధరకు భూములను కొని రౌడీషీటర్లను రంగంలోకి దింపి ఆ భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు బాధితులకు న్యాయం చేయాలని చూస్తున్నా రాజకీయ నాయకుల ప్రవేశంతో అర్హులకు న్యాయం జరగని పరిస్థితి నెలకొన్నది.
– రంగారెడ్డి, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)
అధికారుల ఆదేశాలు బేఖాతరు
జిల్లాలో భూములకు సంబంధించిన ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో పలు భూములను రెవెన్యూ అధికారులు 145 సీఆర్పీ కింద నిషేధిత భూములుగా గుర్తించారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో నిషేధమున్నా దౌర్జన్యంగా ఆ భూముల్లోకి ప్రవేశించి ఘర్షణలకు కారకులవుతున్నారు. ఆదివారం దండుమైలారంలో జరిగిన భూమికి సంబంధించి ఇబ్రహీంపట్నం ఆర్డీవో 11 గుంటల భూమి ఘర్షణలకు కారణమవుతున్నందున ఇరువర్గాల వారు ఎవరూ ఆ భూమికిలోకి ప్రవేశించొద్దని ఆర్డర్‌ను కూడా జారీచేశారు.
అయినా, ఆదివారం ఒకవర్గం వారు అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా ఆ భూమిలోకి వెళ్లడంతోనే అక్కడ ఘర్షణ జరిగి హత్యకు దారి తీసింది. మాడ్గుల మండలంలోని నాగిళ్ల గ్రామంలోనూ వందల ఎకరాల భూములకు సంబంధించి పలుమార్లు ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఆ భూములపైనా రెవెన్యూ అధికారులు 145 సీఆర్పీని అమల్లోకి తీసుకొచ్చారు. జిల్లాలో భూ ఘర్షణలు పెరిగిపోతున్న నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తరచూ తలెత్తుతున్నది.
ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం గ్రామంలో ఆదివారం జరిగిన భూఘర్షణలో ఓ అధికార పార్టీ నాయకుడు జోక్యం చేసుకుని నిందితులకు సహకరించి ఘర్షణకు కారకుడయ్యాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆందోళనకు దిగారు. దండుమైలారంలో 11 గుంటల భూవిషయంపై కొంతకాలంగా ఘర్షణ జరుగుతుండగా.. అధికార పార్టీ నాయకుడు జోక్యం చేసుకుని రెచ్చగొట్టేలా మాట్లాడడంతోనే అక్కడ గొడవ జరిగి ఒకరు హత్యకు గురయ్యారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే.. జిల్లాలోని ఔటర్‌రింగ్‌రోడ్డు పక్కనే ఉన్న కొంగరకలాన్ గ్రామంలోని సర్వే నం.44, 45ల్లోనూ కొంతకాలంగా పెద్దఎత్తున ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణలోనూ అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు రైతులపై దౌర్జన్యానికి దిగుతున్నారు. నాదర్గుల్, రావిర్యాల, కొహెడ వంటి గ్రామాల్లోనూ భూఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఈ దాడులతో పలువురు రైతులు భయభ్రాంతులకు గురై పట్టా భూములను వదిలిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
సర్వే నంబర్లు ఒకచోట.. భూములు మరోచోట..
జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సర్వే నంబర్ ఒకచోట.. భూములు మరోచోట ఉన్నాయి. మరోవైపు అసైన్డ్‌మెంట్ భూములకు సంబంధించి రికార్డుల తారుమారు కావడంతో భూతగాదాలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ కూడా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. భూ సమస్యల పరిష్కారానికి సత్వరంగా చర్యలు తీసుకోకపోతే ఘర్షణలు మరిన్ని జరిగే అవకాశాలున్నాయి.
ప్రాణం తీసిన 11 గుంటల భూమి..
ఇబ్రహీంపట్నం : మండలంలోని దండుమైలారం గ్రామంలో దారుణం జరిగింది. 11 గుంటల భూమి కోసం అన్నను.. తమ్ముళ్లు హతమార్చారు. దండుమైలారంలోని సర్వే నం.156, 158, 159లలో 18 ఎకరాల 12 గుంటల భూమి ఉండగా.. నలుగురు అన్నదమ్ములకు ఒక్కొక్కరికీ 4 ఎకరాల 23 గుంటల చొప్పున వచ్చింది. అయితే రిజిస్ట్రేషన్‌లో మాత్రం ఇద్దరికి 11 గుంటల చొప్పున భూమి తక్కువగా వచ్చింది. తమకు తక్కువగా వచ్చిందని.. ఆ భూమిని తమ సోదరులు ఇవ్వాలని గ్రామానికి చెందిన గూడేటి మల్లయ్య, గూడేటి జంగయ్య కుమారులు పలుమార్లు అడిగారు.
ఈ విషయమై గత కొన్ని రోజులుగా వారి మధ్య ఘర్షణ జరుగుతున్నది. పెద్ద మనుషుల సమక్షంలో ఎక్కువ ఉన్న 11 గుంటల భూమిని తక్కువ ఉన్నవారికి ఇస్తామని మిగిలిన ఇద్దరు సోదరులు ఒప్పుకొన్నా ఇవ్వలేదు. ఈ భూమి సాగు విషయంలో ప్రతిసారీ వారి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. 2024లో ఇరువర్గాలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ భూమిపై తరచూ గొడవలు జరిగి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో ఆ భూమిలోకి ఎవరూ వెళ్లకుండా ఆర్డర్ ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ.. ఇబ్రహీంపట్నం ఆర్డీవోను కోరగా.. ఆయన 145 సెక్షన్ కింద ఈ భూమిలోకి ఎవరూ వెళ్లొద్దని.. నిషేధిత భూమిగా గుర్తించి అక్కడ బోర్డును పాతారు.
ఈ నేపథ్యంలో ఆదివారం గూడేటి నర్సింహ, గూడేటి యాదయ్యల వారసులు ఆ వివాదాస్పద భూమిలోకి వెళ్లారు. విషయం తెలుసుకున్న గూడేటి మల్లయ్య, గూడేటి జంగయ్య వారసులు బాలరాజు, ధనరాజు, వెంకటరాజు, పావని, మంజుల అడ్డుకునేందుకు అక్కడికెళ్లారు. దీంతో ఒక్కసారిగా నర్సింహ, యాదయ్యల వారసులైన బాలరాజు, శ్రీశైలం, యాదయ్య, లింగస్వామి, ప్రసాద్, పద్మ, అర్చన, దేవకమ్మ, పారిజాత కలిసి బాలరాజుపై గొడ్డలితో దాడిచేశారు. విచక్షణారహితంగా నరికి చంపారు. బాలరాజుపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన బాలరాజు తమ్ముడి భార్య అయిన మంజుల, వెంకటరాజు, పావనిలపైనా దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి.
రక్తపు మడుగులో పడి ఉన్న బాలరాజును ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యు లు నిర్ధారించారు. మంజుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఇబ్రహీంపట్నం ప్రైవేట్ ఆస్పత్రి నుంచి నగరంలోని మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం ఠాణాలో నర్సింహ, యాదయ్యల వారసులపై మృతుడి సోదరులు ఫిర్యాదు చేశారు. గూడేటి యాదయ్య, గూడేటి బాలరాజు, గూడేటి శ్రీశైలం, గూడేటి నర్సింహ, గూడేటి లింగస్వామి, గూడేటి ప్రసాద్, గూడేటి పారిజాత, గూడేటి వజ్రమ్మ, గూడేటి అర్చనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తెలిపారు.
శేఖర్‌గౌడ్‌ను అరెస్టు చేయాలని ఆందోళన
బాలరాజు హత్యకు మండలంలోని ఆదిబట్ల మున్సిపాలిటీకి చెందిన ఈసీ శేఖర్‌గౌడ్ కారణమని ఆరోపిస్తూ.. అతడ్ని వెంటనే అరెస్టు చేయాలని మృతుడి కుటుంబీకులు, బంధువులు డిమాండ్ చేశారు. శేఖర్‌గౌడ్‌పై కేసు నమోదు చేసేవరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించొద్దని వారు భీష్మించుకూర్చున్నారు. భూవివాదం తెగకుండా నిందితులను రెచ్చగొట్టేలా మాట్లాడడంతోనే హత్య జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఆందోళనకారులకు నచ్చజెప్పి శాంతిభద్రతల నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
నిందితులను శిక్షించాలని డిమాడ్
భూఘర్షణలో బాలరాజు మృతి చెందడంతోపాటు అతడి కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడడంతో గ్రామస్తులు పెద్దఎత్తున ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానతోపాటు ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాలరాజు హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, అలాగే కాంగ్రెస్ నాయకుడు ఈసీ శేఖర్‌గౌడ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు సముదాయించి ఆందోళనను విరమింపజేశారు.
గ్రామంలో ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు
దండుమైలారంలో బాలరాజు హత్యతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు సారథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఆస్పత్రుల వద్ద కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతున్నది. ఎప్పటికప్పుడు ఇరువర్గాలకు చెందిన నాయకులతో చర్చలు జరుపుతూ.. శాంతియుత వాతావరణం కల్పించేందుకు ఇబ్రహీంపట్నం ఏసీపీ ప్రయత్నాలు చేస్తున్నారు.