జిల్లాలో వివిధ ప్రజావసరాల పేరుతో ప్రభుత్వం సేకరించే భూసేకరణపై సరైన స్పష్టత లేదని రైతులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున భూసేకరణకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం 2016 భూసేకరణ చట్టంలో మినహాయింపులతోనే మళ్లీ భూసేకరణ చేపట్టడంపై రైతులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2016 భూసేకరణ చట్టం మినహాయింపుల ద్వారా ఫార్మాసిటీ భూసేకరణ చేపడితే మినహాయింపులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే భూసేకరణలో మినహాయింపులు లేకుండా చట్టసవరణ చేస్తామని ప్రకటించింది.
కాని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చట్టంలో ఎలాంటి మార్పులు చేయకుండానే గత ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ద్వారానే కొత్తగా భూసేకరణకు తెరలేపింది. ప్రభుత్వం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు కోసం సుమారు వెయ్యి ఎకరాల భూసేకరణ మొదలుపెట్టింది. గ్రీన్ఫీల్డ్ రోడ్డుతో ఈ భూసేకరణ ద్వారా సుమారు 12వందల మంది రైతులు భూములను కోల్పోతున్నారు. వీరిలో అత్యధికంగా సన్నచిన్నకారు రైతులే. ఈ భూములను నమ్ముకుని జీవిస్తున్నారు.
2016 భూసేకరణ చట్టంలో మినహాయింపుల ద్వారా భూసేకరణ చేపట్టడం ద్వారా రైతులకు సరైన పరిహారం అందకపోగా.. వారికి రావాల్సిన పునరావాసం, ఇతర సదుపాయాలు కూడా అందకుండాపోయాయి. ప్రస్తుతం జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో 2016 భూసేకరణ చట్టంలో మినహాయింపులు లేకుండా భూములు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
– రంగారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ)
2016 భూసేకరణ చట్టంలో సెక్షన్ 2, 4, 10ల మినహాయింపు ద్వారా భూసేకరణ చేస్తున్నారు. ఈ మినహాయింపులతో రైతులు తమ హక్కులను పెద్దమొత్తంలో కోల్పోతున్నారు. సెక్షన్ 2లో భూసేకరణకు 80 శాతం మంది రైతులు అంగీకారం తెలిపిన తర్వాతనే భూసేకరణ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 4 ప్రకారం భూసేకరణతో చేపట్టే ప్రాజెక్టు ద్వారా విస్తృతంగా రైతులకు ప్రయోజనాలు కల్పించే అవకాశాలుంటాయి. అలాగే, సెక్షన్ 10 ప్రకారం బహుళ పంటలు (ఏడాదికి రెండు పంటలు) పండే భూములను తీసుకోవద్దని నిబంధన ఉన్నది.
అత్యవసరమైతే తప్పా తీసుకునే భూములు కనిష్ట స్థాయిలో ఉండాలి. అలాగే, ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు, 18 ఏళ్లు పైబడిన ప్రతి కుటుంబ సభ్యుడికి పరిహారం అందించాల్సి ఉంటుంది. అలాగే, ఆ గ్రామంలో స్థిరపడిన కూలీలకు సైతం పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. 2016 భూసేకరణ చట్టంలో మినహాయింపుల వలన రైతులు వీటన్నింటినీ కోల్పోతున్నారు. మినహాయింపులు లేకుండా భూసేకరణ చేపట్టాలని కోరుతున్నారు.
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులందరికీ మీర్ఖాన్పేట్ సమీపంలో ప్లాట్లను చేసి సర్టిఫికెట్లను కూడా కేటాయించింది. కాని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్టిఫికెట్లు పొందిన ఫార్మా రైతులకు భూములు చూపించడంలేదు. గత సంక్రాంతి నాటికే ఫార్మా బాధిత రైతులందరికీ ఇండ్ల స్థలాలను ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయిస్తామని ప్రకటించింది. కాని, ఇప్పటికీ అతీ..గతీ లేదు.
ప్రభుత్వం చేపట్టే భూసేకరణ రైతులకు ప్రయోజనకరంగా ఉండాలి. వారికి ఉపయోగపడే అతి ముఖ్యమైన సెక్షన్లను మినహాయించి భూసేకరణ జరపడంవలన తీవ్రంగా నష్టపోతున్నారు. తమ విలువైన భూములను బలవంతంగా సేకరించి వారికి కొద్దిపాటి పరిహారంఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు.
– సరస్వతి, ఫార్మా వ్యతిరేక భూ పోరాట సమితి కన్వీనర్
తాము అధికారంలోకి వస్తే భూసేకరణ చట్టంలో మినహాయింపులు లేకుండా చట్టాన్ని సవరిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చట్టంలో మార్పులు చేయకుండానే భూసేకరణ చేపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2016 భూసేకరణ మినహాయింపు చట్టంలో భూసేకరణ జరపడం వలన రైతులు పెద్దఎత్తున నష్టపోయారని గతంలో ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చట్టసవరణ చేయకపోవడంపై రైతులు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.