సిటీబ్యూరో, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల హద్దుల నిర్ధారణకు కనీసం మరో ఆరు నెలల గడువు పడుతుందని తెలుస్తున్నది. డిసెంబర్ నెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా… ఆచరణలో సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 3,500 చెరువులకు హద్దులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌ను నిర్ధారిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే కోర్టు విచారణ అనంతరం హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు నిర్వహించిన సమీక్షలో హద్దుల నిర్ధారణలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు.
ఇప్పటికే రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో సమన్వయ లోపం, హద్దుల గుర్తిం పు ప్రక్రియలో జాప్యం జరుగుతున్నది. గడిచిన ఐదు నెలలుగా కేవలం 570 చెరువులకు మాత్రమే పూర్తి చేయగలిగారు. ఈ క్రమంలో మరో ఆరు నెలల వరకు ఈ ప్రక్రియకు గడువు కోరాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. గడిచిన ఐదు నెలలుగా చెరువుల హద్దుల నిర్ధారణను హైకోర్టు పర్యవేక్షిస్తున్నది. చెరువుల పరిరక్షణలో కీలకమైన హద్దుల నిర్ధారణ ప్రక్రియను పూర్తి చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నది. దీంతో మొత్తం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 3,500కు పైగా చెరువులను డిసెంబర్ 30లోగా హద్దులు నిర్ధారించాలని ఇటీవలే హైకోర్టు ఆదేశించింది. కానీ ఈ వ్యవహారంలో హెచ్ఎండీఏ లేక్ విభాగం ఇంకా జాఢ్యం వీడడం లేదు.
ఎందుకు జాప్యం జరుగుతుందంటే..?
హైకోర్టు విచారణ తర్వాత జరిగిన సమీక్షా సమావేశంలో హెచ్ఎండీఏ అధికారులు పలు కీలక విషయాలను ప్రస్తావించినట్లు తెలిసింది. ముఖ్యంగా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధీనంలో ఉన్న హద్దులే ప్రధాన కారణమని తెలిసింది. చెరువుల ప్రస్తుత విస్తీర్ణంతో పోల్చితే, ఆ శాఖల మ్యాపుల్లో పొందుపరిచిన వివరాలు విరుద్ధంగా ఉండడంతో కొత్త సమస్యలు వస్తున్నట్లు తేల్చారు. అయితే మూడు శాఖలను సమన్వయం చేసుకుంటూ కచ్చితమైన కొలతలతో హద్దుల నిర్ధారణ పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.