Madhavaram | కేపీహెచ్బీ కాలనీ, ఫిబ్రవరి 13: కూకట్పల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ బంగారం, వెండి వస్తువులను ఎండోమెంట్ కమిటీకి అప్పగించామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. గురువారం ఆలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ దేవాలయానికి సుమారు 637 గ్రాముల బంగారం, సుమారు 500 గ్రాముల వెండి ఆభరణాలు ఉన్నాయన్నారు. వీటిని భద్రపరిచి ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు స్వామివారికి, అమ్మవార్లకు అలంకరించాలన్నారు. రామాలయం పక్కనే గల ఖాళీ స్థలంలో బ్రాహ్మణుల నివాసం కొరకు గదులు, వంటశాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రామాలయ ప్రాంగణంలో 20 అడుగుల ఎత్తు గల హనుమంతుడి విగ్రహం ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి, ఆలయ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలన్నారు. ఈ వేడుకల కోసం ఎండోమెంట్ విభాగం నుంచి నిధులు కేటాయించాలని అధికారులను కోరారు. ఆలయంలో పూజలు ఇతర వేడుకల్లో భక్తులకు ఇబ్బందులు కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ఎండోమెంట్ ఈవో ఆంజనేయులు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, కమిటీ సభ్యులు తులసి రామ్, సూర్యారావు, తదితరులు పాల్గొన్నారు.